లడ్డు దుష్ప్రచారాలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

లడ్డు దుష్ప్రచారాలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

కోటనందూరు: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నివేదిక ఇచ్చిందని, ఇది సీఎం చంద్రబాబుకు, కూటమి నేతలకు చెంపపెట్టని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. మండలంలోని కాకరాపల్లిలో వెన్నుపోటు పాలనపై పోరుబాట కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులు నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దేశంలోని అన్ని అత్యుత్తమ సంస్థలూ లడ్డు తయారీలో ఎటువంటి తప్పులూ జరగలేదని చెప్పాయన్నారు. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా నిందలు వేసిన కూటమి నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు, వేంకటేశ్వర స్వామికి, వైఎస్సార్‌సీపీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ తరపున తీర్మానం చేశారు.

స్థానిక ఎన్నికల వేళ రోజుకో

స్కిట్‌ చేస్తున్న చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల ముందు చంద్రబాబు రోజుకో స్కిట్‌ చేస్తున్నారని, అందులో భాగంగానే పుస్కర నీటిని పోలవరం కాలువకు మళ్లించి పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని ఉత్తరాంధ్రకు తెచ్చామని ప్రజలను మభ్యపెడుతున్నారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో గొంతు ఎండిపోతోందని ప్రజలు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు బీచ్‌లో స్కిట్‌లు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ నడిబొడ్డున ప్రజలు ట్యాంకు నీరు రూ.8 వేలు పెట్టి కొనుక్కుంటుంటే చంద్రబాబు బినామీలకు ఒక్క రూపాయికే ఎకరం భూమి దొరుకుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వంలో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 20 లక్షల ఇళ్లు కట్టిస్తే ఈ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

ఆకాశన్నంటిన నిత్యావసరాల ధరలు

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు కుదేలైపోతున్నాడని రాజా తెలిపారు. ధరల నియంత్రణ చేపట్టాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. మరోపక్క సీఎం, ఎమ్మెల్యేలు మాత్రం కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో పేదల దగ్గర డబ్బు లేదని, డబ్బంతా ఇతర దేశాలకు తరలిపోతోందని విమర్శించారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రస్తుత టీడీపీ వెన్నుపోటు నుంచి ఆవిర్భవించిందని, దానిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ తుని నియోజకవర్గ పరిశీలకుడు ఏడుకొండలు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్‌, నేతలు లాలం బాబ్జి, గొర్లి రామచంద్రరావు, నల్లమిల్లి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement