ఐ.పోలవరం: సముద్రంలో ఓ బోటు మునిగిన ఘటనలో తొమ్మిది మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలివీ.. ఐ.పోలవరం మండలంలోని మత్స్యకార గ్రామమైన భైరవపాలేనికి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఐదు రోజుల క్రితం చింతా శ్రీనుకు చెందిన మర పడవపై సముద్రంలో వేటకు వెళ్లారు. చేపల వేట అనంతరం తిరిగి వస్తుండగా ఆదివారం రాత్రి బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో వారి బోటు ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. అందులోని వారిని అక్కడే మరో బోటులో ఉన్న మత్స్యకారులు రక్షించి, సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. సముద్రంలో మునిగిన బోటు గాలుల తాకిడికి మొగ వద్దకు కొట్టుకు వచ్చింది. అది పూర్తిగా ధ్వంసమైందని, ఐదు రోజుల పాటు కష్టపడి సంపాదించిన మత్స్యసంపద కూడా నీటమునిగిందని, సుమారు రూ.30 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని చింతా శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాడేందుకు
మళ్లీ అవకాశమివ్వండి
ఎమ్మెల్సీ గోపిమూర్తి
అమలాపురం టౌన్: ఉపాధ్యాయ సమస్యలపై పోరాడేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి కోరారు. యూటీఎఫ్ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సమావేశం స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గోపిమూర్తి తనకు ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశమివ్వాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఐవీ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీఏఎస్ సుబ్బారావు, నేతలు పెంకే వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బోర్నగూడెం
అటవీ ప్రాంతంలోనే పులి
రాజవొమ్మంగి: పులి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం పరిసర అటవీప్రాంతంలో ఉన్నట్లు స్థానిక అటవీ అధికారులు ఆదివారం సాయంకాలం వెల్లడించారు. గత కొన్ని నెలలుగా జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న బెంగాల్ టైగర్ గోదావరి నది దాటి జిల్లాను వీడి వెళ్లినట్లే వెళ్లి తిరిగి జిల్లాకు వచ్చి హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గంగవరం, ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్‌ల నుంచి బుధవారం రాజవొమ్మంగి అటవీక్షేత్రంలోని పులి అడుగిడిన సంగతి కూడా తెలిసిందే. రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో రెండు రోజులు చక్కర్లు కొట్టి వాతంగి ఫారెస్టు సెక్షన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం పులి రాజవొమ్మంగి ఫారెస్టు రేంజ్‌లోనే బోర్నగూడెం అడవుల్లో ఉందని రాజవొమ్మంగి ఎఫ్‌ఆర్వో ఉషారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్నగూడెం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫారెస్టు అధికారులు ట్రాకర్ ద్వారా పులి ఎక్కడ ఉన్నది తెలుసుకుంటునే, మరోవైపు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా పులి రాజవొమ్మంగి అటవీక్షేత్రంలోకి వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా ఎక్కడ పశువులను హాని కలిగించలేదు. గతంలో ఇదే తీరులో సంచరించిన పులి అమ్మిరేఖల, కొమరాపురం, జి.శరభవరం తదితర గ్రామాల్లో అనేక ఆవుదూడలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతానికి తమ పశువులకు ఎటువంటి ప్రాణహాని జరగకపోయినా నాలుగు రోజులుగా ఆకలితో ఉన్న పులి ఎటునుంచి అయినా వచ్చి తమ పశువులను చంపేస్తుందేమోనన్న ఆందోళనలో గిరిజన రైతులు వున్నారు. ఫారెస్టు అధికారులు తగిన చర్యలు తీసుకుని తమను, తమ పాడి పశువులను కాపాడాలని కోరుతున్నారు. పులిని సాధ్యమైనంత త్వరగా సురక్షితమైన అడవులకు పంపించాలని గిరిజన ప్రతినిధులు కోరుతున్నారు.
● 9 మంది మత్స్యకారులు సురక్షితం
● ధ్వంసమైన పడవ..
రూ.30 లక్షల ఆస్తి నష్టం


