కాకినాడ క్రైం: కాకినాడలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మూడు తరాలు చేస్తున్నాయి. జీజీహెచ్‌లో జరిగిన ఈ ఘటన యావత్ నిరుద్యోగ లోకాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. వ్యవస్థలో లోపాలను వేలెత్తి చూపుతోంది. లంచాలు పడేస్తే ఏదైనా సాధ్యమేనన్న విషయాన్ని రూఢీ చేస్తోంది. కాకినాడలోని మల్లయ్య అగ్రహారంలో నివసిస్తున్న జీజీహెచ్ సీనియర్ అసిస్టెంట్, ఓ నర్సు భార్యాభర్తలు. ప్రస్తుతం ఆమె జీజీహెచ్‌లో హెడ్ నర్సుగా పనిచేస్తోంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతనికి చదువు అబ్బలేదు. దురలవాట్లు, చెడు స్నేహాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో కారు ప్రమాదాలు కూడా చేశాడు. చదువు సహా ఉద్యోగం, వ్యాపారం దేనికీ సరిపడడని నిర్ధారించుకున్న భార్యాభర్తలు కారుణ్య నియామకంలో లోపాలే ఆసరాగా ప్రభుత్వ ఉద్యోగం వేయించాలనుకున్నారు. లంచం పడేస్తే చాలు ఏ పనైనా చేసే ఓ గుమాస్తా కాకినాడ జీజీహెచ్‌లో మెడికల్ ఇన్వాలిడేషన్ సీటు చూసేవాడు. తన భర్త ఉద్యోగాన్ని కుమారుడికి ఇచ్చేందుకు ఏం చేయాలని నర్సు అడగడంతో, ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, అనారోగ్య కారణాలతో ఒకరి ఉద్యోగం కుమారుడికి బదిలీ చేయడం కుదరదని చెప్పాడు. అవినీతి ఆరోపణలతో జీజీహెచ్ నుంచి బదిలీ అయిన అప్పటి మేనేజర్‌తో కలిసి ఓ పన్నాగం పన్నాడు.
ఒకొక్కరిది ఒక్కో నాటకం...
కాకినాడ జీజీహెచ్‌లో కారుణ్య నియామకాల్లో చేరిన వారిలో కొందరిది ఒక్కొక్కరిది ఒక్కో నాటకం. ఓ వ్యక్తి తనకు అనారోగ్యం ఉందని, ఎంఎన్‌వోగా పనిచేయలేనని తన కుమారుడికి అదే ఉద్యోగం వేయించాడు. అతడు మాత్రం రీల్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. ఓ రికార్డు అసిస్టెంట్ తన కుమారుడికి ఎల్‌డీసీ ఉద్యోగం వేయించుకున్నాడు. మరో ఎంఎన్‌వో తాను అనారోగ్యంతో ఉన్నానని చెప్పి కుమారుడికి మెకానిక్ ఉద్యోగం వేయించాడు. ఆ తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రిలో కలియదిరుగుతూ స్నేహితులను పలకరిస్తూ గడపడం గమనార్హం. ఆ స్థానంలో అంతకుముందు పనిచేసిన గ్రేడ్–2 మెకానిక్ మృతి చెందగా, అతడి కుమారుడికి పూర్తి అనర్హతల మధ్య ఉద్యోగాన్ని కట్టబెట్టారు. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్–2లో సాధించే ఉద్యోగాన్ని డిగ్రీ పూర్తి చేయకుండా, టైప్ రైటింగ్ అర్హత కూడా లేకుండా రెండు మినహాయింపులతో కండిషనల్ అపాయింట్‌మెంట్ ఇచ్చేశారు. ఒకే అభ్యర్థికి రెండు అంశాల్లో మినహాయింపులు ఇవ్వడం ఎక్కడా జరగలేదు, ఒక్క కాకినాడ జీజీహెచ్‌లో తప్ప. ఈ అభ్యర్థి గంజాయికి బానిసై మూడు కారు ప్రమాదాలు చేశాడు. తండ్రి చనిపోగా వచ్చిన రూ.80 లక్షల మొత్తాన్ని బెట్టింగ్‌లు, పేకాట, మాదకద్రవ్యాలకు వినియోగించి దుబారా చేశాడు. ఇప్పటికీ విధుల్లో మత్తులోనే జోగుతుంటాడు. ఇలాంటివారికి కూడా కళ్లు మూసుకొని ఇచ్చిన కారుణ్య నియామకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
మెడికల్ ఇన్వాలిడేషన్ మాయాజాలం
కారుణ్య నియామకాల్లో దారుణాలకు కారణం మెడికల్ ఇన్వాలిడేషన్ అనే ప్రక్రియలో లోపాలే. ఈ విధానంలో అప్పటి వైద్యులు అమ్ముడుపోయి లంచాలు ముట్టజెప్పినవారికి కోరిన రోగాన్ని రాసిచ్చేవారు, జనరల్ మెడిసిన్ వైద్యులే అన్ని అనారోగ్యాలనూ నిర్ధారించేసి, సర్టిఫికెట్లు ఇచ్చేసేవారు. దరఖాస్తుదారులకు, మెడికల్ బోర్డుకు మధ్య వారధిగా ఓ సీనియర్ అసిస్టెంట్, అవినీతి మేనేజర్ కొనసాగేవారు. ఉత్తుత్తి విడాకుల కేసులో హెడ్ నర్సు సదరు సీనియర్ అసిస్టెంట్‌కు రూ.7 లక్షలు ముట్టజెప్పినట్టు వినికిడి.
నిరుద్యోగులకు తీవ్ర నష్టం...
ఇలాంటి దగాకోరు కారుణ్య నియామకాల వల్ల నిరుద్యోగుల బతుకు అన్యాయమైపోతుంది. నిజమైన అర్హులెవరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. రెండు, మూడు తరాలుగా ఉద్యోగాలను వదలకుండా గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి తీరు, నిరుద్యోగుల భవితను చిదిమేస్తోంది. పోనీ వీరంతా నిజమైన అర్హులా అంటే అదీకాదు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రానివారు కూడా ప్రభుత్వోద్యోగులు అయిపోతున్నారు. ఇంటర్మీడియట్.. అంతకంటే తక్కువ అర్హత ఉన్నవారు కూడా ఏ పోటీ పరీక్షా రాయకుండానే డిగ్రీ స్థాయి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. అప్పటివరకు ఉద్యోగాలు చేసి సంపాదించుకొని రిటైర్మెంట్‌కి సరిగ్గా ఐదేళ్ల ముందు ఇలాంటి దగాకు దిగి తమ తర్వాతి తరాలకు ప్రభుత్వ ఉద్యోగాలు అప్పగిస్తున్నారు.
జీజీహెచ్‌లో 21 మంది...
కారుణ్య నియామకాల ద్వారా దశాబ్ద కాలంలో ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే 21 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. ఇలా చేరిన వారిలో జూనియర్ అసిస్టెంట్లు 7, ఎంఎన్‌వోలు 5, ఎఫ్‌ఎన్‌వోలు 1, ఆఫీస్ సబార్డినేట్లు 3, తోటీలు 2, టేబుల్ బాయ్ 1, టేబుల్ విమెన్ 1, వాచ్‌మెన్ 1 ఉన్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా వీరిలో ఏ ఒక్కరి నియామకాన్నీ జిల్లా ఉన్నతాధికారులు పునఃపరిశీలించకపోవడం గమనార్హం.
అందరూ ‘మానసిక రోగులే’నట!
మనోవ్యాధికి మందు లేదన్న సామెతను చక్కగా ఒంటబట్టించుకున్నారు కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఉద్దండులు. కేన్సర్, తీవ్రమైన గుండె జబ్బులు, స్ట్రోక్, పక్షవాతం, అతి తీవ్ర నాడీ సంబంధ వ్యాధులు, కిడ్నీ వైఫల్యం, కంటిచూపు కోల్పోవడం, పూర్తిస్థాయి వినికిడి లోపం, లోకోమోటర్ శారీరక వైకల్యం, తీవ్రమైన మానసిక అనారోగ్యం, డిమెన్షియా విత్ మెంటల్ డిజార్డర్ రోగాలతో బాధపడుతున్నవారికి మాత్రమే కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అందులోనూ చికిత్సతో నయమయ్యే వాటికి వర్తించదు. ఒక్క డిమెన్షియా విత్ మెంటల్ డిజార్డర్ కేటగిరీ మాత్రమే చికిత్సకు పూర్తి స్థాయిలో సహకరించని ఓ మానసిక అనారోగ్య స్థితిగా పరిగణించబడుతుంది. దీంతో అప్పటివరకు నిక్షేపంగా ఉద్యోగం చేసుకున్నవారంతా ఒక్కసారిగా మతిభ్రమించి మానసిక రోగులు అయిపోతారు. ఇక ఉద్యోగం చేయడం తమ వల్ల కాదంటారు, మతిమరుపు వచ్చిందని కాగితాలు పుట్టిస్తారు. వీటితో తమ వారికి ఉద్యోగాలు వేయించుకుంటారు.
అడ్డదారుల్లో ఒకరి ఉద్యోగం
కుటుంబంలో మరొకరికి బదిలీ
ఇలా మూడు తరాలుగా ప్రభుత్వ
ఉద్యోగాలు చేస్తున్న ఒకే కుటుంబం
‘మెడికల్ ఇన్వాలిడేషనే’ మంత్రదండం
మతిమరుపు వచ్చిందంటూ
దరఖాస్తుదారుల మాయ
భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ
ఉద్యోగులైతే ఉద్యోగ బదిలీకి నో చాన్స్
విడాకులు తీసుకొని మరీ కుమారుడికి
ఉద్యోగం వేయించిన
జీజీహెచ్ ఉద్యోగ దంపతులు
తాజాగా వెలుగులోకి వచ్చిన వైనం
రిటైర్మెంట్‌కి ముందు పన్నాగం
జీజీహెచ్‌లో కారుణ్య నియామకాల్లో
చేరినవారు పదేళ్లలో 21 మంది
ఎన్ని చదువులు చదివినా.. ఎన్ని ర్యాంకులు సాధించినా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం లేని నేటి రోజుల్లో.. జీవితాలను ధారపోసి, వయోపరిమితి దాటి చివరికి ప్రైవేటు రంగంలో చిరుద్యోగాలతో సరిపెట్టుకుంటున్నవారు ఎందరో. కానీ ఇక్కడ కొంతమందికి అవలీలగా ఉద్యోగాలు వచ్చి ఒళ్లో వాలుతున్నాయి. ర్యాంకులు, మార్కులతో అన్ని అర్హతలు ఉండీ పోటీపరీక్షల్లో నెగ్గుకొచ్చే సత్తా ఉన్న ఓ నిరుద్యోగికి దక్కాల్సిన అవకాశాన్ని అప్పనంగా లాగేసుకొని, కులాసాగా సంపాదించుకుంటున్నారు. అదెలాగంటే..
ఉత్తుత్తి విడాకులు
వీరి సలహాతో ఉద్యోగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓ దగాకు ఈ దంపతులు సిద్ధమయ్యారు. తమ కుమారుడికి ఉద్యోగం రావడం కోసం ఉత్తుత్తి విడాకులకు అర్జీ పెట్టుకున్నారు. ఇద్దరి అంగీకారం ఉండటంతో విడాకుల పత్రాలూ త్వరగానే వచ్చాయి. వాటి సాయంతో దరఖాస్తు చేసి కుమారుడికి ఉద్యోగం వేయించారు. ఇక్కడే ఇంకో తప్పుని గుమాస్తాతో కలిపి వీరు అవలీలలగా చేసేశారు. ఏపీ కారుణ్య నియామక నిబంధనలు, జీవో ఎంఎస్ నంబర్లు, 18, 25, 612, 661, 687లను అనుసరించి విడాకులు తీసుకొని ఐదేళ్లు పూర్తయితేనే సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం బదిలీ అవ్వాలి. కానీ ఐదేళ్లు పూర్తి కాకుండానే కుమారుడిని ఉద్యోగంలో కూర్చోబెట్టారీ దంపతులు. తొలుత టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత గుమాస్తాగా కొనసాగిస్తున్నారు. విడాకులు తీసుకున్న వీరు ఎప్పటిలాగే మల్లయ్య అగ్రహారంలో ఉన్న స్వగృహంలో ఒక దగ్గరే కాపురం ఉంటున్నారు.


