కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆగ్రహం
కాకినాడ రూరల్: కాకినాడ యాంకరేజ్ పోర్టు సమీపంలో ప్రతిపాదించిన సుస్థిర విమాన ఇంధన ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రహసనంగా మారిందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక రైతులకు, మత్స్యకారులకు తీర ప్రాంత నగర గ్రామీణ ప్రజలకు పత్రికా ముఖంగా కనీస సమాచారం ఇవ్వకుండా, నోటిఫికేషన్ వివరాలను గోప్యంగా ఉంచి నిర్వహించిన ఈ సేకరణ చట్టవిరుద్ధమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త రమణరాజు దుయ్యబట్టారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ కాలుష్య నియంత్రణ ఉన్నతాధికారులకు, సుప్రీంకోర్టుకు లేఖ పంపినట్టు తెలిపారు. లోపభూయిష్టంగా జరిగిన నిన్నటి సమావేశాన్ని రద్దు చేసి, స్థానిక భాషలో పూర్తి నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచి తక్షణమే ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అత్యంత సున్నితమైన కాకినాడ తీర ప్రాంతంలో వందలాది ఎకరాల మడ అడవులు, సముద్ర జీవ వైవిధ్యం, సీఆర్‌జెడ్ పరిధిని ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ విధ్వంసం వల్ల మత్స్యకారుల జీవనోపాధి, తాగునీటి భద్రత పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో తీరప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ఇచ్చే ప్రాధాన్యతపై కంపెనీ యాజమాన్యం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కాకినాడ భవిష్యత్తును బలిపెడితే ఊరుకునేది లేదని, స్థానిక బాధితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
జీజీహెచ్‌లో త్వరలో ‘హేల’ సేవలు
కాకినాడ క్రైం: కేన్సర్ వైద్యసేవల్లో వినియోగించే అత్యాధునిక లీనియర్ యాక్సిలరేటర్ (హేల) సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని జీజీహెచ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సత్యకుమార్ యాదవ్ ఆదేశించారన్నారు. ఓఎన్‌జీసీ సహకారంతో రూ.36.65 కోట్ల అధునాతన చికిత్సా పరికరాలు కాకినాడ జీజీహెచ్‌లో కేన్సర్ వైద్య పరీక్షల కోసం కేటాయించినట్టు చెప్పారు. హేల యంత్రం ద్వారా రేడియేషన్ చికిత్స ప్రారంభించేముందు నూతనంగా అందుబాటులోకి వచ్చిన సీటీ స్కాన్ యంత్రంతో రోజూ పరీక్షలు జరిపి మూడు కోణాల నుంచి కేన్సర్ కణితి ఉన్న ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించవచ్చన్నారు. పరికరాల నిర్వహణకు నూతనంగా నిర్మితమవుతున్న ప్రభుత్వ ఐటీఐ సమీపంలో కేన్సర్ సేవల భవంతిలో రూ.7 కోట్ల వ్యయంతో బంకర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


