కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. మంగళవారం విధుల విరామ సమయంలో నల్ల మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించి, నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులమంతా శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికి వస్తాయో తెలియని అరకొర జీతాలతో బతుకీడుస్తున్నామని వాపోయారు. కాకినాడ జీజీహెచ్‌లో మొత్తం 600 మంది నర్సులు ఉంటే వారిలో 450 మంది కాంట్రాక్టు ఉద్యోగులేనని తెలిపారు. వీరికి అదనంగా ఒప్పంద విధానంలో ఫార్మసిస్టులు, ఎల్‌టీలు పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగ భద్రత నుంచి ఆరోగ్య భద్రత వరకు ఏ ఒక్కటీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వేదనను పరిగణించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నెల రోజుల గడువు పేరుతో కాలయాపన చేసి డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
రాచపల్లిలో..
ప్రత్తిపాడు రూరల్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ఆందోళనలకు రాచపల్లి పీహెచ్‌సీ సిబ్బంది సంఘీభావం తెలిపారు. మంగళవారం పీహెచ్‌సీ వద్ద సూపర్‌వైజర్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది, ఆశ కార్యకర్తలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి మృతి చెందిన సందర్భంలో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. హెల్త్ కార్డులు, బదిలీల సౌకర్యం కల్పించాలని జేఏసీ డిమాండ్లకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఎం.అజయ్‌కుమార్‌తో పాటు పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
నల్ల మాస్కులు ధరించి
పారామెడికల్ ఉద్యోగుల నిరసన


