కాకినాడ రూరల్: రాష్ట్రంలోనే అతి పెద్దదైన డీఎస్సీ ఉద్యోగ నియామకాల స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై తమ పార్టీ తొలి నుంచీ పోరాడుతోందని అన్నారు. ఇటీవల కొన్ని మీడియా చానళ్లు ఆధారాలతో సహా ఈ అక్రమాల పుట్టను వెలికి తీయడంతో ప్రజలకు వాస్తవాలు స్పష్టమవుతున్నాయని చెప్పారు. పెద్దాపురానికి చెందిన సక్కు లక్ష్మీ సునీత బీసీ–బి నుంచి బీసీ–ఈ కేటగిరీలోకి తన కులాన్ని మార్చుకుని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్పలో తెలుగు టీచర్‌గా ఉద్యోగం పొందారని తెలిపారు. ఈ వ్యవహారంపై షేక్ అమీరుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని, కానీ, అధికారులు ఇప్పటికీ ఆమె సర్టిఫికెట్లను పరిశీలించకపోవడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. దీనినిబట్టి ఈ స్కామ్‌లో అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయని నాగమణి అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రభాకర్ మొదలు, శ్రీకాకుళం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావడం వెనుక కూటమి ప్రభుత్వ అవినీతి ఉందన్నారు. అర్హత లేని వారిని అడ్డదారుల్లో నియమిస్తే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఈ అంశంపై గతంలో ప్రభుత్వాధికారులు వివరణ ఇచ్చారని, ఇప్పుడు వారు సైతం వెనకాడుతున్నారని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్ని నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అకాడమీలు, అసోసియేషన్లు ఇచ్చే సర్టిఫికెట్లు ఉద్యోగార్హతకు ఏవిధంగా ప్రామాణికం అనే విషయంలో ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లో వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ఆయన మౌనం వీడాలని నాగమణి సూచించారు.


