తుని: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం మంగళవారం కాకినాడలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆదివారం తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ పైడా వారి వీధిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఉమ్మడి గోదావరి జిల్లా రీజనల్ కోఅర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
ముగ్గురు దేవస్థానం
ఉద్యోగులకు పదోన్నతులు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతి లభించింది. సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్ ఏఈఓగా, సీనియర్ అసిస్టెంట్లు పోల్నాటి లక్ష్మీనారాయణ, జి సుబ్రహ్మణ్యేశ్వరరావు (విష్ణు)లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందారు. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.
ఏకగ్రీవంగా రెవెన్యూ
అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏక్రగీవంగా ఎన్నికై ంది. రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలో ఒక్కొక్క దరఖాస్తు చొప్పున మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి వీఎస్ దివాకర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సామర్లకోట తహసీల్దార్ కె.చంద్రశేఖరరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.కృష్ణ, ఉపాధ్యక్షులుగా జేవీఆర్ రమేష్, కె.సాయికిరణ్, కేఎస్వీ సుబ్బారావు, ఎన్.చందన, కార్యదర్శిగా ఎస్.రామ్మోహన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంటీఆర్ ప్రసాద్, క్రీడా విభాగ కార్యదర్శిగా డీఆర్‌కే రాజు, జాయింట్ సెక్రటరీలు, కోశాధికారి, ఈసీ సభ్యులుగా మరికొందరు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పితాని త్రినాథరావు, జేఏసీ మాజీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ
అధికారిగా వీటీ రామారావు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా వీటీ రామారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న ఆయన కాకినాడకు బదిలీపై వచ్చారు. ఆత్మ పీడీగా పనిచేస్తున్న రాబర్ట్ పాల్ ఇప్పటివరకు ఇన్‌చార్జి వ్యవసాయ శాఖాధికారిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
బాల్య వివాహం.. ఇరు
కుటుంబాలపై కేసు నమోదు
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గత నెల 31న మైనర్ బాలికకు బాల్య వివాహం జరిపించిన ఘటనలో వరుడితో పాటు ఇరు కుటుంబాలు, సహకరించినవారిపై కేసు నమోదు చేసినట్టు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 31న ఉదయం 11 గంటల సమయంలో జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వివాహం జరుగుతున్నట్టు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అధికారులకు సమాచారం అందింది. బాల్య వివాహాల నిరోధక కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో మైనర్ బాలికకు మొయిళ్ల కృష్ణ అనే యువకుడితో వివాహం జరిగినట్టు గుర్తించారు. వన్నెపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అందించిన నివేదిక ఆధారంగా యువకుడు మొయిళ్ల కృష్ణ, అతని తల్లిదండ్రులు మొయిళ్ల రాంబాబు, ఏసమ్మ, బాలిక తల్లిదండ్రులు నాగళమూడి మంగరాజు, గాయత్రి, వివాహానికి సహకరించిన అనిశెట్టి యాకోబురెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు.


