రంపచోడవరం: సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన 20 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్ పోర్టల్ సాయంతో పోలీసులు రికవరీ చేశారు. వాటిని శుక్రవారం యజమానులకు అందజేశారు. సుమారు రూ.2.50 లక్షల విలువైన ఆ ఫోన్లను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ ఓఎస్‌డీ జవాలి అల్ఫాన్సా, రంపచోడవరం డీఎస్పీ, ఎస్‌డీపీఓ పి.అష్రఫ్ అలీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రంపచోడవరం సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


