రియల్‌ దందా | - | Sakshi
Sakshi News home page

రియల్‌ దందా

Sep 5 2026 12:20 AM | Updated on Sep 5 2026 12:20 AM

జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు

అనుమతులు లేకుండానే ప్లాట్ల విభజన

ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలనూ వదలని రియల్టర్లు

కౌడా పరిధిలోనే

33 అక్రమ లే అవుట్ల గుర్తింపు

నట్టేట మునుగుతున్న కొనుగోలుదారులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లావ్యాప్తంగా రియల్‌ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలు తుంగలో తొక్కుతోంది. అనుమతులు లేకుండానే అనధికారిక లే అవుట్లు వేసేస్తోంది. రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలకు అవస్థలు తెచ్చి పెడుతోంది. ఇదంతా తెలిసినా కొంత మంది అధికారులు రూ.లక్షల్లో మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో వెలసిన అనధికారిక లే అవుట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 100కు పైగా లే అవుట్లు ఉండగా.. వీటిలో 80 శాతం అనధికారికంగానే ఏర్పాటు చేశారంటే రియల్‌ దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ నగరా భివృద్ధి సంస్థ (కౌడా) అధికారులు ఇటీవల కొన్నిచోట్ల చేపట్టిన తనిఖీల్లో 33 లే అవుట్లు అక్రమమని గుర్తించారు. కొన్ని లే అవుట్లలో పాతిన రాళ్లను కౌడా అధికారులు తొలగించి, అక్కడితో మిన్నకుండిపోయారు.

కూటమి నేతల అండతో..

రియల్‌ వ్యాపారంలో సింహభాగం కూటమికి చెందిన నేతలే ఉండటంతో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండానే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే తాము కూటమి నేతలమంటూ బెదిరిస్తున్నారు. కూటమి నేతలు తానా అంటే.. వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు అధికారులు తందానా అంటున్న పరిస్థితి నెలకొంది. లే అవుట్‌ స్థలాన్ని బట్టి ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తూతూమంత్రంగా దాడులు చేయడం.. అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారుతోంది. ఇదే అదునుగా రియల్‌ వ్యాపారులు అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. కొందరైతే నీటి ప్రవాహాలు, చెరువులు, కాలువలు, సామాజిక స్థలాల వంటి ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి లే అవుట్లుగా మార్చి విక్రయించేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది వివాదాస్పద స్థలాలను సైతం వదలడం లేదు. ఇలాంటి లే అవుట్లకు కొంత మంది అధికారులు సైతం పర్సంటేజీలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారని కొనుగోలుదార్లు వాపోతున్నారు. తెలియక కొనుగోలు చేసి, నిండా మునుగుతున్నామని వాపోతున్నారు.

నోటీసులతో సరి

అక్రమ లే అవుట్లపై అధికారులు రెండు రోజులు హడావుడి చేయడం.. నోటీసులు ఇచ్చామని చెప్పడం మినహా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారు.. కేసులు నమోదు చేశారా.. జరిమానా విధించారా.. అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

కత్తిపూడి లే అవుట్‌లో సర్వే రాళ్లు తొలగిస్తున్న సిబ్బంది

కౌడాలో గుర్తించిన అక్రమ లే అవుట్లు

మండలం అక్రమ విస్తీర్ణం

లే అవుట్లు (ఎకరాలు)

శంఖవరం 2 4

తొండంగి 3 5

పెద్దాపురం 6 11

జగ్గంపేట 7 14

కాకినాడ రూరల్‌ 8 21

కిర్లంపూడి 3 6

బరి తెగిస్తున్నారిలా..

పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పొలాలను ఇష్టానుసారం చదును చేసి లే అవుట్లుగా మార్చేస్తున్నారు. ప్లాట్లుగా విభజించి రూ.లక్షలకు అమ్మేస్తున్నారు. పట్టణాల్లోని ప్రధాన సెంటర్లు, హైవేల సమీపాన విలువ ఎక్కువగా ఉన్న భూములపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే భూములు చదును చేసి అనధికారంగా లే అవుట్లు వేసేస్తున్నారు. కొందరైతే మరీ బరితెగిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకు అనుమతులు సైతం తీసుకోవడం లేదు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి నిబంధనలూ పాటించడం లేదు. వీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకునేందుకు, బ్యాంక్‌ రుణాలు పొందేందుకు నానా అగచాట్లూ పడుతున్నారు.

లే అవుట్‌ వేసే ముందు భూమిని వ్యవసాయేతర భూమిగా రెవెన్యూ అధికారుల వద్ద మార్పు (కన్వర్షన్‌) చేయాలి. అయితే, ఈ ప్రక్రియ దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. కన్వర్షన్‌ లేకుండానే లే అవుట్‌ వెలుస్తోంది.

లే అవుట్‌లో అంతర్గత రహదారులు 30 అడుగులు ఉండాలి. కానీ, 15 నుంచి 20 అడుగుల రోడ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక అవసరాలకు (పార్క్‌, కమ్యూనిటీ హాల్‌ వంటి వాటికి 10 శాతం స్థలాన్ని ఆ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ చేయించాలి. క్షేత్ర స్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు. 40 శాతం స్థలం పోతే తమకేమీ మిగలదన్న ఉద్దేశంతో రియల్టర్లు అనధికారికంగా విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement