జగ్గంపేట: స్థానిక కరాటే మాస్టర్ టీవీవీ రమణ గిన్నిస్ బుక్‌లో చోటు సాధించారు. బ్లాక్ బెల్ట్ 6డాన్‌గా వున్న రమణ ఆ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్ణీత వ్యవధిలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. 2026 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో ఆ సంస్థకు రిజిస్టర్ చేసుకున్న అనంతరం వారు ఆయన నైపుణ్య ప్రదర్శనను తిలకించారు. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీన ఖమ్మంలో ఖమ్మం కలెక్టర్ దివాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి!
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై లారీ నిలిపి, నిద్రపోయిన డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులు తెలిపిన కథనం మేరకు పరవాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ట్యాంకర్‌ను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా రాయనగూడేనికి చెందిన డ్రైవర్ గుండు లింగరాజు (40) స్థానిక జాతీయ రహదారిపై ధర్మవరం పెట్రోల్ బంకు వద్ద నిలిపి క్యాబిన్‌లో నిద్రపోయాడు. ట్యాంకర్ వెనుక వచ్చే మరో లారీ డ్రైవర్ వచ్చి చూసేసరికి లింగరాజు మృతి చెంది ఉన్నాడు. లారీ డ్రైవర్ సమాచారం మేరకు లింగరాజు భార్య నాగలక్ష్మి సాయంత్రం ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిద్రలో గుండెపోటు రావడంతో అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని శవపరీక్షకై స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఏసుబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


