చెరువులో పడి వ్యక్తి మృతి
కొత్తపల్లి: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాకతిప్ప గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ (55) విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న చెరువులో దిగిన గేదెలను బయటకు కొట్టేందుకు గట్టు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గట్టు జారిపోవడంతో చెరువులో పడిపోయాడు. స్థానికులు బయటకు తీసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం 108లో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని మేడపై కాలు జారిపడిపోవడంతో గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల బాలికల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నైని పాప అనే బాలిక సాయంత్రం కళాశాల తరగతులు ముగిసిన తరువాత కళాశాల భవనం మేడపైకి వెళ్లి అక్కడ కాలు జారి పడిపోయింది. దీంతో కళాశాల సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి కాలు విరిగిందని వైద్యులు నిర్థారించారు. ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జేసీ ప్రశాంత్‌కుమార్ పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


