● అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
● చేబ్రోలులో ఘటన
పిఠాపురం: ఇంటి సరిహద్దులో గజం స్థలం కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సోమవారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇవీ.. చేబ్రోలులోని కొత్తపేటకు చెందిన ఉలవకాయల సత్తిబాబు (65)కు పక్కింటి దూళిపూడి మహేష్‌కు ఇటీవల ఇంటి సరిహద్దులో గజం స్థలంపై వివాదం నెలకొంది. ఇది గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు.. స్థలాన్ని సర్వే చేయించి, హద్దులు తేల్చుతామని, అప్పటి వరకు గొడవలు పడొద్దని చెప్పారు. అయితే సోమవారం సాయంత్రం ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ మాటామాటా పెరిగింది. ఈ వివాదంలో తన తల్లిని తిట్టాడని ఆరోపిస్తూ ఉలవకాయల సత్తిబాబుతో దూళిపూడి మహేష్ గొడవ పడి, చేయి చేసుకున్నాడు. ఇంతలో స్థానికులు అక్కడకు వచ్చి, ఇద్దరినీ విడదీసి పంపించి వేశారు. కొంతసేపటికి సత్తిబాబు తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి మృతి చెందాడు. మహేష్ కొట్టడం వల్లే సత్తిబాబు మృతి చెందాడని మృతుడి బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారు.


