బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణఖు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులూ కల్పించాలన్నారు. జిల్లాలో 70.012 హెక్టార్లలో సాగు చేస్తుండగా ఇప్పటివరకు 50,824 హెక్టార్లలో క్రాప్ బుకింగ్ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో 271 రైతు సేవా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని పరిశీలించేందుకు అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏలేరు డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, జలవనుల శాఖ ఇంజనీర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ నీటి వనరులపై ఉన్న ఆక్రమణలను నిబంధనల ప్రకారం తొలగించాలని ఆదేశించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన
కరప: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ పారామెడికల్ జేఏసీ పిలుపు మేరకు వేళంగి పీహెచ్‌సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ల్యాబ్ టెక్నీషియన్ సత్యనారాయణ, స్టాఫ్ నర్సులు శ్రావణి, అంబిక, ప్రియ తదితరులు నల్ల రిబ్బన్లు ధరించి పీహెచ్‌సీకి ఎదురుగా భోజన సమయంలో నిరసన తెలిపారు. పీహెచ్‌సీ డాక్టర్ ఆర్.శ్రీనివాస్‌నాయక్ తదితర సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతు తెలియజేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధినిర్వహణలో మరణించిన ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపట్టారు.
శ్రీపాద క్షేత్రానికి
భక్తుల తాకిడి
రాఖీపౌర్ణమి వేడుకల కోసం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
పిఠాపురం: శ్రీపాద శ్రీవల్లభుడు, దత్తాత్రేయుని జన్మస్థలం కావడంతో పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికొచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కట్టడం ఆనవాయితీగా ఉంది. శుక్రవారం రాఖీ పౌర్ణమి అయినప్పటికీ గురువారం నుంచే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. ఈ ఏడాది సుమారు 30 వేల మంది వరకు మహారాష్ట్రీయులు తరలిరావడం విశేషం. పిఠాపురంలో పేరొందిన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శుక్రవారం నిర్వహించే రాఖీ పౌర్ణమి ఉత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఆర్ సౌజన్య తెలిపారు. గోపూజలు, దత్త హోమాలు, పల్లకీ సేవలు వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం నాటికి మరింత మంది వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. పాదగయ క్షేత్రంలో వెలసివున్న దత్తాత్రేయ స్వామి వారికి గురువారం రాఖీ పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


