ఫ అమ్మ భాషకు పట్టం కడదాం
ఫ మాతృభాష పరిరక్షణకు
గత ప్రభుత్వం పెద్దపీట
రాయవరం: పాల మీగడ కన్న, పంచదారల కన్నా.. జుంటి తేనెల కన్న మధురమైనది మన తెలుగు భాష. ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు ప్రవచిస్తే.. ‘నికోలోడికోంటీ’ అనే చరిత్రకారుడు తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేర్కొన్నాడు. తెలుగు భాష గొప్పదనాన్ని మన కవులు శతాబ్దాల కిందటే విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు జాతి గొప్పదనాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన బహుభాషా కోవిదుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఏటా ఆ రోజు తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.
గత ప్రభుత్వంలో కృషి
మమ్మీ, డాడీ పిలుపులకు అలవాటుపడిన తల్లిదండ్రులు చాలా ఏళ్లుగా తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించడానికి ఇష్టపడటం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో సైతం పూర్తిగా ఇంగ్లిషు మీడియం అమలు చేస్తున్నారు. అయితే, ఇంగ్లిషుతో పాటు పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు కూడా తెలుగు మీడియంలోనే నిర్వహించాలని కోరుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు తెలుగులోనే ఉత్తీర్ణత పొందలేకపోతున్నారు. పలువురు పదో తరగతి విద్యార్థులు చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునాది అభ్యసనానికి ప్రాధాన్యమిచ్చింది. తెలుగు, ఇంగ్లిషులో బలమైన పునాది వేయాలనే ఉద్దేశంతో 2022 నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) అమలు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రీ ప్రైమరీ బోధించే దాదాపు 5,800 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, ప్రైమరీలో 1, 2 తరగతులు బోధించే 6 వేల మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనపై శిక్షణ ఇచ్చారు. అలాగే, 3, 4, 5 తరగతులకు టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ పేరుతో తెలుగు, ఇంగ్లిషులో వెనుకబడిన విద్యార్థులను భాషాపరంగా అభివృద్ధి చేసేందుకు తర్ల్ ప్రోగ్రామ్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 3, 4, 5 తరగతులు బోధించే 8 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
రేపు తెలుగు భాషా దినోత్సవం
ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు ఎక్కడ?
జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుకు సంబంధించిన నిబంధనలు నేటికీ అమలుకు నోచడం లేదు. దీనిపై తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకూ ఇంగ్లిషు అవసరమే అయినప్పటికీ.. మాతృభాష తెలుగుకు కూడా అంతే ప్రాధాన్యమివ్వాలని వారు కోరుతున్నారు.


