సీతానగరం: స్థానిక కై లాసగిరి ర్యాంపు వద్ద అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమ దందా సాగుతోంది. నిబంధనలను, పర్యావరణ చట్టాలను గోదాట్లో తొక్కి మరీ అక్రమార్కులు యథేచ్ఛగా అనధికారిక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. కళ్లెదుటే టన్నుల కొద్దీ ఇసుకను కై లాసగిరి దగ్గర నిల్వ చేసి, ట్రాక్టర్లపై విచ్చలవిడిగా తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గుర్తించిన అధికారిక ర్యాంపుల నుంచే మాత్రమే ట్రాక్టర్లపై ఇసుక రవాణా జరగాలి. కానీ, కై లాసగిరి ర్యాంపులో అనధికారికంగా భారీ స్థాయిలో ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లలో తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు దిగమింగుతున్నారు. మితిమీరిన లోడుతో దుమ్ము రేపుతూ, వేగంగా రాకపోకలు సాగిస్తున్న ఈ ట్రాక్టర్ల ధాటికి గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. వీటివలన ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం కై లాసగిరి ర్యాంపు నుంచి బహిరంగంగానే ఇసుక అక్రమ దందా భారీ స్థాయిలో సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనుక ఉన్న గుట్టు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కై లాసగిరి అనధికారిక ర్యాంపుపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ దర్జాగా ఇసుక అక్రమ దందా
ఫ రేయింబవళ్లు విచ్చలవిడిగా రవాణా
ఫ పట్టించుకోని అధికారులు
ప్రజలు తిరగబడతారు జాగ్రత్త
కై లాసగిరి ర్యాంపు నుంచి ట్రాక్టర్లపై విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రేయింబవళ్లు ట్రాక్టర్లపై ఇసుక, బొండు మట్టిని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. తమ ఎదుటే ఈ ట్రాక్టర్లు వెళ్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత విచ్చలవిడిగా దందా నడుపుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రజలు తిరగపడతారు జాగ్రత్త.
– పెదపాటి రమేష్‌బాబు (డాక్టర్ బాబు),
వైఎస్సార్ సీపీ వలంటీర్ల విభాగం రాష్ట్ర
సంయుక్త కార్యదర్శి, సీతానగరం


