పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు!
రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్‌మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.
కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్‌లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్‌రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది.
హతమార్చింది అందుకేనా?
ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమైపె కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్‌కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్‌కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్‌పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్‌ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్‌కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది.
ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది!
గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్‌ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్‌పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్‌లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్‌కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్‌కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి.
పొంతన లేకుండా..
ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పితమని కుటుంబ సభ్యులు అంటున్నారు.
నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది
ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు.
ఫ జిమ్ ట్రైనర్ హత్యతో ఉలిక్కిపడిన జిల్లా
ఫ ఎస్పీ కార్యాలయానికి
కూతవేటు దూరంలోనే దారుణం
ఫ ఘోరంగా హతమార్చిన దుర్మార్గులు


