ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టులో ఆదివారం 76.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. వర్షాలు అనుకూలించకపోవడంతో అనుకున్న స్థాయిలో జలాలు లేవు. దీంతో సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 76.49 మీటర్ల నీటిమట్టం ఉంది. 24.11 టీఎంసీలకు గాను 9.69 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 100, విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 14 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,95,855, పూజా టికెట్లకు రూ.3,58,180, కేశఖండనశాలకు రూ.16,680, వాహన పూజలు, ఇతర సేవలకు రూ.14,380, కాటేజీలు, వసతి గదులు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.89,300, విరాళాలు రూ.40,173, వేద ఆశీర్వచనం రూ.17,298 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తలు, శ్రీవారి సేవకులతో కలసి పర్యవేక్షించామన్నారు.
మీనా మృతదేహానికి
పోస్టుమార్టం పూర్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఉద్యోగ నియామకాలకు చట్టం చేయాలి
రంపచోడవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకే దక్కేలా ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం తక్షణమే అమలు చేయాలని ఏపీ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జలగం రాంబాబు, మువ్వల అమర్నాథ్ డిమాండ్ చేశారు. రంపచోడవరంలో ఆదివారం జరిగిన ఏటీఏ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డీఎస్సీ–2025లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా టీచర్ నియామకాలు చేపడితే తీవ్ర స్థాయిలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. 1/70, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం షెడ్యూల్డ్ ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏటీఏను మరింత బలోపేతం చేసి, చట్టపరమైన హక్కులు సాధించుకుంటామని అన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా విలీనం చేయకుండా ప్రతి గిరిజన పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సరియం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏటీఏ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి మట్ల కృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడిగా కురసం ఫకీర్‌దొర, ఉపాధ్యక్షుడిగా కుంజం రాంబాబుదొర ఎన్నికయ్యారు.


