ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ అజయ్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ సదుపాయం కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి 45 రోజుల గడువు ఇచ్చామన్నారు. ఈ నెల 20 నాటికి గడువు ముగుస్తుందని చెప్పారు. గడువులోగా ప్రభుత్వం నుంచి చర్చలు జరపకపోతే సెప్టెంబర్ 7వ తేదీ దాటిన తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీపీహెచ్, డీఎంఈ, దీఎస్‌హెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.అనితతో పాటు జిల్లాలోని మండల స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేశామని అజయ్ వివరించారు.


