● జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్
● రాయవరంలో చిరు వ్యాపారి మృతి
రాయవరం: శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు భార్య సిద్ధమైంది. ఈ లోపు జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న ఆమె భర్త విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన రాయవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన జి.వెంకటేశ్వర్లు (42) రాయవరం బస్టాండ్ సెంటర్‌లో భార్య భవానీతో కలిసి కొన్నేళ్లుగా ఫ్రూట్ జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మిక్సర్‌లో జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న భవానీ వెంటనే ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ షాక్‌ను తప్పించేందుకు చీపురుతో బలంగా కొట్టింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వర్లు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు దేవుడు అన్యాయం చేశాడంటూ ఆమె బోరును విలపించింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇద్దరు చిన్నారులతో కలిసి విలపిస్తున్న ఆమెకు స్థానికులు భరోసాగా నిలిచారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కావలి తీసుకువెళ్లేందుకు వ్యాపారులు, ఆటో యూనియన్ నాయకులు, స్థానికులు కలిసి రూ.30 వేలు సేకరించి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. పుట్టెడు దుఖంతో భర్త మృతదేహాన్ని తీసుకుని భవాని కావలికి బయలుదేరింది.


