పుర పోరుకు సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

పుర పోరుకు సిద్ధం!

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

కాకినాడ నగరం (ఫైల్‌)

జిల్లా పరిషత్‌ కార్యాలయం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లను పజలే నేరుగా ఎన్నుకునే విధానానికి ఆమోదం లభించింది. 30 ఏళ్ల తర్వాత ఈ విధానం తెరపైకి వచ్చింది. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చితే మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లను ఎన్నికల విధానంలో ప్రజలే ఎన్నుకోనున్నారు. అర్బన్‌ ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది.

ఇదీ సంగతి

స్థానిక సంస్థల్లో మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ను గతంలో నేరుగా ప్రజలు ఓటు వేసి ఎన్నుకునేవారు. 30 ఏళ్ల క్రితం నుంచి పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. అనంతరం రాజ్యాంగ సవరణలు చేపట్టడంతో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మున్సిపల్‌ చైర్‌ పర్సన్లను కౌన్సిలర్లు, మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకునే విధానం అమలవుతోంది.

ప్రత్యక్షం అంటే..

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌ ఎన్నికలు తీసుకుంటే సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లను ప్రజలు ఓట్లు వేసి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నికై న సర్పంచ్‌ ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. వారిని అభిశంసనతో తొలగించే అవకాశం ఉండదు. పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంతో రెండేళ్లకో, రెండున్నరేళ్లకో అభిశంసన ప్రక్రియ ద్వారా పదవుల్లో మార్పు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఐదేళ్ల పాటుపదవిలో ఉండే అవకాశం ఉంటుంది.

జిల్లా పరిషత్‌ల విభజన!

జిల్లా పరిషత్‌ల విభజనపై సైతం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్‌లను 28గా విభజించనున్నట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కొలువుదీరనుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 62 మండలాలు ఉన్నాయి. 62 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 58 స్థానాలకు జెడ్పీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీళ్లంతా కాకినాడ జెడ్పీ కార్యాలయానికే వస్తున్నారు. ఉమ్మడి తూర్పు నాలుగు జిల్లాలుగా (కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం) విడిపోయింది. జిల్లా పరిషత్‌ విభజనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తరుణంలో నాలుగు జిల్లా కేంద్రాల్లో నాలుగు జెడ్పీ కార్యాలయాలు ఆవిర్భవించనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు 22 మండలాలు, పోలవరం జిల్లాలో 12, కోనసీమ 19, కాకినాడ జిల్లాలోకి 21 మండలాలు వెళ్లనున్నాయి. ప్రస్తుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోని మండలాలు కలవడంతో మండలాల సంఖ్య 74కు చేరింది. ఆ ప్రకారం నాలుగు జిల్లా పరిషత్‌లు, 74 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నాయి.

టీడీపీ నేతల్లో గుబులు

ప్రత్యక్ష ఎన్నికల ప్రకటనతో టీడీపీ ఆశావహుల్లో గుబులు రేగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా విశ్వాసాన్ని కోల్పోతూనే వస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, టీడీపీ నేతలు మద్యం, ఇసుక మాఫియా అవతారం ఎత్తి అవినీతికి పాల్పడటం, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఈ పరిణామం ప్రజల్లో టీడీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తోంది.

ఉమ్మడి ‘తూర్పు’లో...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపల్‌ కార్పొరేషన్లు (రాజమహేంద్రవరం, కాకినాడ), 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మ డి జిల్లాలో మార్చి 14న అన్ని మున్సిపాలిటీల ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తే పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మున్సిపాలిటీలకు 1987లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మండపేట మున్సిపాలిటీకి బిక్కిని విజయ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గా గెలుపొందారు. 1995, 2000లో మున్సిపాలిటీల్లో డైరెక్టర్‌గా ఎన్నికలు జరిగాయి. 2005, 2014, 2020లో పరోక్ష ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్‌లోగా నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను గుర్తించేందుకు మంగళవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది.

వైఎస్సార్‌ సీపీకే ప్రజల మద్దతు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నిక విధానం తీసుకువచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎలాంటి ఎన్నికల విధానం అమలు చేసినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్‌ సీపీకే ప్రజల మద్దతు ఉంటుంది. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలైనా ప్రజలు వైఎస్సార్‌ సీపీకి అండగా నిలుస్తారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎదుర్కొనేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో సిద్ధంగా ఉన్నాం.

– విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు

ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న

మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

ఇప్పటి వరకు పరోక్ష విధానం అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement