బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర కొత్త రహదారిని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. పోర్టు నుంచి జాతీయ రహదారి 216 వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమా వేశం నిర్వహించారు. సంస్థ అధికారి బి.కృష్ణమూర్తి నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టు నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పోర్టు నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం మీదుగా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఐదు కిలోమీటర్ల రహదారితో రవాణా దూరం 22 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం 30 నుంచి 40 నిమిషాల వరకు ఆదా అవుతుందన్నారు. తద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, రహదారి భద్రత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు.
పనులు వేగవంతం చేయాలి
జిల్లా పరిధిలో చేపట్టిన సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వివిధ శాఖల ఇంజినీర్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇనన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీపీ), ఆర్‌అండ్‌బీ, కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన ఇంజినీర్లతో వివిధ నిధుల కింద చేపట్టిన సివిల్ పనుల పురోగతిపై సమీక్షించారు. అలాగే ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో సర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బూత్ లెవల్ అధికారులు ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ తమ పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.


