వివాదాల సుడి.. సత్యదేవుని గుడి | - | Sakshi
Sakshi News home page

వివాదాల సుడి.. సత్యదేవుని గుడి

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

షాపుల నుంచి లీజు వసూలులో

లోపించిన పారదర్శకత

నిబంధనలకు తిలోదకాలు

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులతో నిర్వహణకు అనుమతి

అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో వేలం ద్వారా షాపులను లీజుకు తీసుకున్న వ్యాపారుల విషయంలో అధికారులు ద్వంద వైఖరి పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం వద్ద రెండు పండ్ల దుకాణాలకు వేలం నిర్వహించారు. దానిలో మొదటి షాపునకు నెలకు రూ.16.70 లక్షలు, రెండో నెంబర్‌ షాపునకు నెలకు రూ.18.33 లక్షలకు వేలం ఖరారైంది. నిబంధనల ప్రకారం లీజుదారులు ఆరు నెలల సొమ్మును జీఎస్టీ కలిపి దేవస్థానానికి చెల్లించాలి. ఆ ప్రకారమే రెండో నంబర్‌ షాపు లీజుదారు సుమారు రూ.1.30 కోట్లు చెల్లించి వ్యాపారం ప్రారంభించాడు. ఒకటో నంబర్‌ షాపు లీజుదారు కూడా అదేలా చెల్లించి షాపు ప్రారంభించాలి. కానీ రూ.55 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తానికి రెండు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిస్తే అధికారులు అనుమతిచ్చేశారు.

చెక్కులు బౌన్స్‌ అవుతున్నా..

ఇప్పటికే దేవస్థానంలో వివిధ వ్యాపారాలకు సంబంధించి లీజుదారులిచ్చిన రూ.3 కోట్ల విలువైన 20 చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. వాటిలో ఐదు చెక్కులకు సంబంధించి లీగల్‌ నోటీసులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఎలా అంగీకరించారనేది వారికే తెలియాలి.

షాపులు వెనక్కి జరపాలని..

పశ్చిమ రాజగోపురం వద్ద గల షాపులను వెనక్కి జరపాలని ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కక్షగట్టి అధికారుల ద్వారా తమపై ఒత్తిడి తెస్తున్నారని వ్యాపారులు విమర్శిస్తున్నారు. ఈ నెల 20 లోగా నాలుగడుగులు వెనక్కి జరపాలని సి సెక్షన్‌ అధికారులు వ్యాపారులను సోమవారం ఆదేశించిన నేపథ్యంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులు గత నాలుగేళ్ల నుంచి ఒకే లైన్‌లో ఉన్నాయని, కార్తిక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు కూడా వెనక్కి జరిపించలేదని చెబుతున్నారు. కాగా.. పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు క్యాష్‌ కాకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈవో ఎన్‌.సూర్యచక్రధరరావు అన్నారు. దీనిపై ఆయనను వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. ఇంకెవరికీ ఇలా అవకాశమివ్వబోమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement