ఫ కలెక్టర్ హరేంధిర ప్రసాద్
ఫ అధికారులు, ఉత్సవ కమిటీలతో
సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వినాయక చవితి పండగ సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గణపతి నవరాత్రులు, నిమజ్జనం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజించాలని, విగ్రహాల తయారీలో రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను ఉపయోగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై గణేశ్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. మండపాల వద్ద ఉత్సవ కమిటీలు అగ్ని ప్రమాద నివారణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, అగ్నిమాపక, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాలతో సహా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేశ విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఆ వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని కోరారు.
ఫ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 389 గ్రామాల్లో 75 గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా గుర్తించడం జరిగిందని, వాటిలో ఇప్పటి వరకు 61 గ్రామాలను ప్రకటించామన్నారు. మిగిలిన గ్రామాల్లోని పనులు వేగవంతం చేసి సురక్షిత తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు.


