కాకినాడ క్రైం: జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. రంగరాయ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల ఆందోళన మంగళవారం ఏడో రోజుకు చేరింది. జీజీహెచ్ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సుమారు 700 మందికి పైగా హౌస్ సర్జన్లు, పీజీలు విధులు బహిష్కరించి నిరసన గళాన్ని వినిపించడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు సహా అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవల్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం పరిశీలించారు. కాగా..శిక్షణ భృతి (స్టైఫండ్)ని 15–30 శాతం మేర పెంచాలని, 65 ఏళ్ల ఉద్యోగ విరమణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన మెడికోలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దిగి వచ్చి జూడాలతో చర్చలు జరపాలని నాయకులు కోరారు.
సీపీఎం మద్దతు
జూనియర్ వైద్యుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నగర కన్వీనర్ పలివెల వీరబాబు మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉంటే అందులో 700 మందికి పైగా కాకినాడలోనే ఉన్నారన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి తక్షణమే జూడాలతో చర్చలు జరిపాలన్నారు.


