కాకినాడ క్రైం: మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, మత్తు మాయలో పడొద్దని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి జాగరపు విజయ అన్నారు. నగరంలో సీబీఎం కళాశాలలో మంగళవారం నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు సీడీపీవో చెదలవాడ వెంకట్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వాటికి అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబ, సామాజిక బంధాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోషల్ వర్కర్ చినబాబు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమం కోసం శాఖ ద్వారా అందుతున్న అవకాశాలు, పిల్లలకు దక్కే చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలను విక్రయించిన వారితో పాటు బానిసలైన వారిపైనా న్యాయపరమైన చర్యలు తప్పవని ప్యానల్ అడ్వకేట్ సునీల్‌కాంత్ తెలిపారు. సదస్సులో నాయవాదులు ఏసుబాబు, బషీర్, వసంత కుమారి, కళ్యాణి, పారా లీగల్ వలంటీర్లు మల్లికార్జున్, అబ్దుల్ ఎస్ రెడ్డి, ప్రిన్సిపాల్ క్రాంతిరేఖ పాల్గొన్నారు.


