● శ్వాసనాళంలో ఇరుక్కున్న వేరుశనగపప్పు
● అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు
● ప్రాణాపాయం నుంచి బయటపడ్డ చిన్నారి
బీచ్‌రోడ్డు (విశాఖ): వేరుశనగపప్పు తింటుండగా ప్రమాదవశాత్తు శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన రెండున్నరేళ్ల చిన్నారి విశాఖపట్టణంలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి వైద్యులు అరుదైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్స చేశారు. కాకినాడకు చెందిన కరుణప్రియకు 20 రోజుల క్రితం వేరుశనగపప్పు శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాకినాడలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా సమస్య గుర్తించలేదు. ఈనెల 10న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి శ్వాసనాళంలో పప్పు ఉన్నట్లు గుర్తించి విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 14 ఏళ్లకు పైబడిన వారికే బ్రాంకోస్కోపీ చేసిన ఆస్పత్రిలో తొలిసారిగా చిన్నారికి ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుమారు 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి శ్వాసనాళంలోని వేరుశనగపప్పును విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పిన్న వయసు చిన్నారికి బ్రాంకోస్కోపీ చేయలేదని, ఈ కేసును సవాల్‌గా తీసుకుని వైద్య బృందం సమష్టి కృషితో శ్వాసనాళంలోని వేరుశనగపప్పును విజయవంతంగా తొలగించామని తెలిపారు.
చిన్నారి
కరుణ ప్రియ
శ్వాసనాళం నుంచి
తొలగించిన వేరుశనగపప్పు


