14న ప్రత్తిపాడులో జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

14న ప్రత్తిపాడులో జాబ్‌ మేళా

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వికాస ఆధ్వర్యంలో ఈ నెల 14న ప్రత్తిపాడులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. జాబ్‌మేళా పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. వికాస సంస్థ పీడీ లచ్చారావు మాట్లాడుతూ 35 కంపెనీలు మేళాకు వస్తున్నాయని, సుమారు 1,550 ఉద్యోగాలను భర్తీ చేస్తాయని తెలిపారు.

సత్యగిరి సర్వే ప్రారంభం

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన సత్యగిరి సర్వే పనులు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. తొండంగి మండల సర్వేయర్‌ సత్యనారాయణ సూచనల మేరకు బెండపూడి సర్వేయర్‌ మల్లేశ్వరరావు రోవర్‌ మెషీన్‌ సాయంతో సర్వే చేశారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓలు అనకాపల్లి ప్రసాద్‌, విశ్రాంత ఆర్‌ఐ ప్రసాద్‌ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత పంపా ఘాట్ల నుంచి సర్వే ప్రారంభించారు. కొంత దూరం ముందుకు వెళ్లి వెనక్కి వచ్చి సర్వే చేశారు. తొలి రోజు 25 ఎకరాలను సర్వే చేశామని, నాలుగు రోజుల్లో మొత్తం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సర్వే చేసిన ప్రాంతంలో సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతారు. కాగా.. పోడు వ్యవసాయం పేరుతో గత వారం సత్యగిరిని ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నాలపై సాక్షి పత్రికలో వచ్చిన వార్తా కథనాలపై అధికారులు స్పందించి ఈ చర్యలు చేపట్టారు.

టీడీపీ నేతల నిర్వాకం..

నిలిచిన దర్శనాలు

ఆత్రేయపురం: టీడీపీ నేతల నిర్వాకం పుణ్యమా అని భక్తులకు శివయ్య దర్శనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. వివరాలివీ.. ఆత్రేయపురంలో 3 శతాబ్దాలకు పూర్వం నుంచి శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వర స్వామి (శివాలయం) ఉంది. ఇక్కడ శివయ్యకు అత్రి మహర్షి సైతం పూజలు చేశారని పెద్దలు చెబుతారు. ఇంతటి ఖ్యాతికెక్కిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించే పేరుతో ఇక్కడి అర్చకుల ఇళ్లను టీడీపీ నేతలు మూడు నెలల కిందట దౌర్జన్యంగా కూల్చివేశారు. ఆ సందర్భంగా అర్చకులపై దౌర్జన్యానికి సైతం పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విధులు నిర్వహించడానికి అర్చకులు నిరాకరించారు. దీంతో, టీడీపీ నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు కొంతకాలం విధులు నిర్వహించాలని ప్రధానార్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మను కోరారు. దీనికి ఆయన మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చారు. ఆ గడువు పూర్తి కాగా, ఇప్పటి వరకూ వేరే అర్చకుడిని నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆలయంలో సోమవారం నుంచి దర్శనాలు, అభిషేకాలు నిలిపివేసినట్లు భాస్కరశర్మ తెలిపారు. ఇక్కడ శివకేశవుల ఆలయాల పునర్నిర్మాణానికి భక్తులు రూ.1.50 కోట్ల వరకూ విరాళాలు అందించారు. ఇంతవరకూ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై దాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక హంతకులను

కఠినంగా శిక్షించాలి

రాజమహేంద్రవరం సిటీ: నగరంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ మహిళా విభాగం, ఏపీ జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రియాంకకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ స్థానిక ఏపీ ఎన్జీవో హోమ్‌ నుంచి గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకూ సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ మీసాల మాధవరావు మాట్లాడుతూ ప్రియాంక మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement