తుని: చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉందని, పర్యవేక్షణ అధికారులు ఏమి చేస్తున్నారంటూ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించని ఇద్దరు అంగన్‌వాడీ వర్కర్లను తొలగించాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే. తుని పట్టణం గవరపేటలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం ఫుడ్ కమిషనర్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించగా పిల్లల హాజరు ఫుల్‌గా ఉంది. కానీ కేంద్రాల్లో మాత్రం పూర్తిస్థాయిలో కనిపించలేదు. అలాగే రికార్డుల్లో ఇతర సరుకుల వివరాలు కూడా సక్రమంగా లేనట్టు గుర్తించారు. ఆ ఇద్దరు అంగన్‌వాడీ వర్కర్లను విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇదే పరిస్థితులు మిగిలిన కేంద్రాల్లోనూ ఉంటే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలకు సంబంధించిన బాలికలు కిచిడీ బాగోలేదని తెలిపగా, వెజ్ బిర్యానీ పెట్టాలని ఆదేశించారు. వీరవరపుపేట ఎస్సీ వసతి గృహం శిథిలావస్థకు చేరిందని, భయంగా గడుపుతున్నామని బాలికలు చెప్పారు. ఆ భవనానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సివిల్ సప్లయిస్ అధికారులు పాల్గొన్నారు.
ఫ అంగన్‌వాడీల్లో పిల్లల హాజరులో
అవకతవకలు
ఫ గుర్తించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్
చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి
ఫ ఇద్దరు వర్కర్ల తొలగింపునకు ఆదేశం


