ముందారికాళ్లకు బంధం | - | Sakshi
Sakshi News home page

ముందారికాళ్లకు బంధం

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

మలికిపురం: సఖినేటిపల్లి– నరసాపురం వంతెన ప్రజల చిరకాల వాంఛ. దీనికోసం పలు ప్రభుత్వాల్లో శంకుస్థాపనలు జరగడం, ఆనక ఆగిపోవడం తెలిసిందే. 2021లో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చి ఈ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వశిష్ట గోదావరి నదిపై ప్రస్తుతం పంట్లు తిరిగే... సఖినేటిపల్లి నుంచి నరసాపురం వరకూ వంతెన నిర్మిస్తే బైపాస్‌ కలిసే ప్రాంతానికి ఇబ్బంది వస్తుందని భావించారు. దీంతో సఖినేటిపల్లి– నరసాపురం ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దిగువన అంతర్వేది వైపు రామేశ్వరం– రాజుల్లంకల వద్ద వంతెన నిర్మాణానికి రూపకల్పన చేశారు. దీనివల్ల నరసాపురం, రాజోలు నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలుగుతుంది. దీంతో పాటు కోస్తా జిల్లాలకు వ్యాపార, వాణిజ్య అవసరాలు తీరతాయి. ఈ పనుల కోసం 2021లో తొలి విడతగా రూ.400 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుకు తాజా అంచనాలతో రూ.600 కోట్లకు చేరింది. అప్పట్లో వంతెన, రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం తొలి విడతగా రూ.65 కోట్లు విడుదల చేశారు. వంతెన కోసం ఉభయ జిల్లాల్లోనూ 38 హెక్టార్ల భూమి సేకరించారు. నగదు చెల్లింపులు దాదాపు పూర్తయ్యాయి.

కలిసేది ఇలా.. : ఈ వంతెన, రోడ్డు నిర్మాణం స్వల్ప మార్పులతో డిజైన్‌ను అన్ని విధాలా ప్రజలకు ప్రయోజనకరంగా రూపొందించారు. కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం దిండి వద్ద జాతీయ రహదారి నుంచి బైపాస్‌ మార్గం ప్రారంభం అవుతుంది. రామరాజులంక, పెదతిప్ప, గుడిమెళ్లంక, మలికిపురం, సఖినేటిపల్లి మండలంలో టేకిశెట్టిపాలెం, అంతర్వేదిపాలెం, సఖినేటిపల్లి, రామేశ్వరం మీదుగా గోదావరి నది దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రాజుల్లంక, పీచుపాలెం మీదుగా సీతారామపురంలో జాతీయ రహదారి 216కు అనుసంధానం అవుతుంది. మొత్తం 23.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అవుతుంది. ఇందులో రాజుల్లంక– రామేశ్వరం మధ్య గోదావరి నదిపై 1,100 మీటర్ల పొడవున వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది.

ఫ కూటమిలో కుమ్ములాట

ఫ వంతెన, బైపాస్‌ నిర్మాణానికి గ్రహణం

ఫ నాటి సీఎం జగన్‌ కృషితో ముందుకు..

ఫ నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వెనక్కి

టీడీపీ వర్సెస్‌ జనసేన

రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చాలని గుడిమెళ్లంకకు చెందిన కూటమి నేత కోర్టుకు వెళ్లడంతో అప్పట్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయాల్సిన భూమిపూజ రెండుసార్లు వాయిదా పడింది. కేవలం ఒక్క గుడిమెళ్లంకలో ప్రధాన పంట కాలువపై ఫ్‌లై ఓవర్‌ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని మార్చాలని ఆ రైతు కోర్టుకెళ్లారు. గుడిమెళ్లంకకు చెందిన అల్లూరు విశ్వనాథరాజు జిల్లా, హైకోర్టుల్లో వేసిన కేసును కొట్టివేయడంతో తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్లారు. గత ఫిబ్రవరిలో విశ్వనాథరాజు వేసిన కేసుపై కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు యెనుముల వెంకటపతిరాజు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సుప్రీం కోర్టులో ఇంప్లీడ్‌ పిటీషనర్‌గా చేరి ముందుకు వెళ్లడంతో కోర్టు కేసు డిస్మిస్‌ చేసింది. అలైన్‌మెంట్‌ విషయం తప్ప ఇతర ఇబ్బందులు ఉంటే కింద కోర్టుకు వెళ్లాలని సూచించడంతో విశ్వనాథరాజు తిరిగి హైకోర్టులో కేసు వేశారు. కోర్టుకు వెళ్లవద్దని రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ కూడా విశ్వనాథరాజుకు చెప్పినా వినలేదని సమాచారం. ఈ విషయంలో నియోజకవర్గ టీడీపీ నేతలు సైతం మిన్నకుండడం జనసేన, టీడీపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఏదేమైనా వంతెన నిర్మాణానికి ‘కూటమి’గా అడ్డంగులు సృష్టించారని జనం అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement