దేవస్థానం వైద్యాధికారి రాజీనామా
అన్నవరం: స్థానిక వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆసుపత్రి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక్కడ వైద్యాధికారిగా పనిచేస్తున్న హరికృష్ణ వ్యక్తిగత కారణాలతో గత బుధవారం రాజీనామా చేశారు. దీంతో కొండ దిగువన దేవస్థానం ఆసుపత్రిలో, రత్నగిరిపై కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రాథమిక హెల్త్ సెంటర్‌లో వైద్యుడు లేకుండానే అక్కడ సిబ్బంది పాక్షికంగా వైద్య సేవలందించాల్సి పరిస్థితి వచ్చింది. పైన ఉన్న దేవస్థానం ఆసుపత్రిలో ముందు నుంచీ వైద్యులు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై గత నెల 5న ‘సాక్షి’ దినపత్రికలో ‘దివ్య క్షేత్రం.. వైద్యం పూజ్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో కొండ దిగువన దేవస్థానం ఆసుపత్రిలో వైద్యుడు హరికృష్ణను రత్నగిరిపై కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రాథమిక హెల్త్ సెంటర్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి కింద దేవస్థానం ఆసుపత్రిలో సేవలందించాలని ఈఓ నల్లం సూర్యచంద్రరావు ఆదేశించారు. గత నెల పదో తేదీ నుంచి డాక్టర్ హరికృష్ణ రత్నగిరిపై ఉదయం సేవలందించేవారు. తాజాగా ఆయన రాజీనామాతో పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ఇక్కడ కొత్త వైద్యుడిని నియమించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాఽధికారి (డీఎంహెచ్‌ఓ)కు నివేదిక పంపించినట్లు దేవస్థానం ఏఈఓ శ్రీనివాస్ తెలిపారు.


