ఎస్పీకి మహిళా కమిషన్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీకి మహిళా కమిషన్‌ నోటీసులు

Jul 8 2026 12:09 AM | Updated on Jul 8 2026 12:09 AM

కాకినాడ క్రైం: ఓ మహిళా న్యాయవాదిపై సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు నోటీసులు జారీ చేసింది. వివరాలివీ.. కాకినాడకు చెందిన సీనియర్‌ మహిళా న్యాయవాది కొయ్య నాగజ్యోతి గత మార్చి 21న తన క్లయింట్‌ టి.గంగాభవాని పెట్టిన కేసు విషయమై కాకినాడ మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కేసుకు సంబంధించిన పత్రాలు కోరగా.. నాగజ్యోతితో అప్పటి సీఐ రవికుమార్‌ అభ్యంతరకరంగా, దురుసుగా వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలిని నిరసిస్తూ నాగజ్యోతి స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయంపై ఎస్పీ బిందుమాధవ్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ ఘటనపై నిగ్గు తేల్చేందుకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని కోరినా నిరాకరించారు. నాగజ్యోతికి ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) అండగా నిలిచింది. సీసీ టీవీ ఫుటేజీ తీసి, వాస్తవాల ఆధారంగా సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో, బాధితురాలు రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా గత ఏప్రిల్‌ 24న ఎస్పీకి కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. దీనికి కూడా ఎస్పీ స్పందించకపోవడాన్ని కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. తాజాగా మరోమారు ఈ నెల 3న ఎస్పీకి రిమైండర్‌ నోటీసు జారీ చేసింది. తొలి నోటీసుకు బదులేమీ ఇవ్వలేదని ప్రస్తావిస్తూ, సీఐ రవికుమార్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది, తక్షణమే చర్యలు తీసుకుని యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించింది.

ఆశా వర్కర్ల ఆందోళన

పిఠాపురం రూరల్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విరవ, గొల్లప్రోలు పీహెచ్‌సీల వద్ద ఆశా వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజువారీ అత్యవసర ఆరోగ్య విధులు నిర్వహిస్తున్న తమకు బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మార్చి 5న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, తమ యూనియన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీఓలు, సర్కులర్లు వెంటనే విడుదల చేయాలని, కోరారు. కనీస వేతనం అమలు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఈ నెల 31న జరగనున్న చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జాతీయ ఎస్టీ కమిషన్‌ సీరియస్‌

రంపచోడవరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ చోళ్ల బొజ్జిరెడ్డి నేతృత్వంలో స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఇటీవల అధికారికంగా జరిగిన గ్రీవెన్స్‌కు కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ, రంపచోడవరం ఆర్‌డీఓ హాజరు కాకపోవడాన్ని జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ అత్యంత తీవ్రంగా పరిగణించిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము పంపిన ఫిర్యాదులను స్వీకరించిన కమిషన్‌, ప్రొటోకాల్‌ ఉల్లంఘన, విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి జాతీయ నోటీసులు జారీ చేసిందన్నారు. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి తక్షణం స్పందించారని, ఈ వ్యవహారంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని, పూర్తి నివేదికను నేరుగా ఢిల్లీ, భువనేశ్వర్‌లోని జాతీయ కమిషన్‌కు సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు శ్రీను పేర్కొన్నారు.

టెన్త్‌ విద్యార్థుల డేటాలో

మార్పులకు చివరి అవకాశం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా లోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష మార్కుల జాబితా వివరాల్లో అవసరమైన సవరణలకు ఈ నెల 10వ తేదీ వరకూ చివరి అవకాశం కల్పించారు. డీఈఓ కంది వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రధానోపాధ్యాయులందరూ విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా సరి చూసుకుని, ఏవైనా సవరణలుంటే గడువులోగా హెచ్‌ఎం లాగిన్‌ల ద్వారా సమర్పించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement