బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రానున్న రోజుల్లో కౌమార గర్భధారణ, బాల్య వివాహాలు నమోదైతే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలో కౌమార దశ గర్భధారణలు, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌమారదశ గర్భధారణలు, బాల్య వివాహాల నివారణను ఉద్యమంలా చేపట్టి, ఈ మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొట్టేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి అధికారీ చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. బాలికల డ్రాపౌట్లపై విద్యా శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కౌమారదశ గర్భధారణ నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఎన్యూమరేషన్ పత్రాలు నూరు శాతం పంపిణీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో నూరు శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తయ్యిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ నియోజవర్గాల ఈఆర్‌ఓలతో కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 1,640 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 16,50,811 మంది ఓటర్లకు 100 శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపినీ పూర్తయ్యిందని చెప్పారు. ఇప్పటి వరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ 60.30 శాతం మేర పూర్తయ్యిందని, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. వలస, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారికి కచ్చితంగా నోటీసులు జారీ చేయాలని సూచించారు.


