కడియం సబ్‌ రిజిస్ట్రార్‌పై విచారణ | - | Sakshi
Sakshi News home page

కడియం సబ్‌ రిజిస్ట్రార్‌పై విచారణ

Jul 8 2026 12:09 AM | Updated on Jul 8 2026 12:09 AM

కాకినాడ లీగల్‌: ఎక్కడి నుంచైనా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం అమలులో ఉన్న నేపథ్యంలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆస్తులకు కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తగిన లింక్‌ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లేకుండానే ఉమ్మడి జిల్లాలోని ఆస్తులకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) సీహెచ్‌ జానకీదేవి విచారణ నిర్వహించారు. తగిన ఆధారాలు లేకుండానే పలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తించారు. దీనిపై రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి కొద్ది రోజుల కిందట నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కె.ప్రసాదరావును ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌గా, కోనసీమ జిల్లా రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావును విచారణ అధికారిగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రసాదరావు సమక్షంలో నాగలింగేశ్వరరావు కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ ఇ.లక్ష్మిని మంగళవారం విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా పూర్వార్జితంగా చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆధారాలు, నిబంధనల అమలు తదితర అంశాలపై వివరణ కోరినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement