సంస్కరణం | - | Sakshi
Sakshi News home page

సంస్కరణం

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

ఉపాధికి గండి

ఇప్పటివరకు దస్తావేజుల తయారీ, స్లాట్‌ బుకింగ్‌, స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులు, ఆన్‌లైన్‌ డేటా అప్‌లోడ్‌ వంటి సేవలను దస్తావేజు లేఖర్లు నిర్వహిస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ సేవలన్నీ ప్రైవేట్‌ సంస్థలకు వెళ్లే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు జీవనోపాధి కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీఓ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పెన్‌డౌన్‌ నిర్వహించాలని సంఘాలు నిర్ణయించాయి.

రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్త జీఓ జారీ

జిల్లాలో దస్తావేజు లేఖర్ల ఆందోళన

జీవనోపాధి కోల్పోతామని ఆవేదన

6, 7 తేదీల్లో పెన్‌డౌన్‌కు పిలుపు

కాకినాడ లీగల్‌: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో సంస్కరణల పేరుతో జీఓ నంబరు 396ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నేరుగా నిర్వహిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సేవలను ఇకపై పబ్లిక్‌ – ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ విధానంతో సేవలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం చెబుతుండగా, తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని దస్తావేజు లేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీఓ ప్రకారం రాష్ట్రంలోని (పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా) అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ సర్వీస్‌ సెంటర్లు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేయనున్నారు. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల తరహాలో సింగిల్‌ విండో విధానంలో పౌరులకు సేవలు అందించనున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆర్‌ఎస్‌కేలు ఏర్పాటు చేస్తారు. అక్కడ దస్తావేజుల తయారీ, డేటా ఎంట్రీ, అడ్వాన్స్‌ స్లాట్‌ బుకింగ్‌, స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులు, పత్రాల పరిశీలన వంటి సేవలను ప్రైవేట్‌ సంస్థలే నిర్వహిస్తాయి. తుది రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆమోదం మాత్రం సబ్‌ రిజిస్ట్రార్‌ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి దస్తావేజుపై రూ.2 వేల వరకు సేవా రుసుం వసూలు చేయనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ఫీజులు, స్టాంప్‌ డ్యూటీలు చెల్లిస్తున్న ప్రజలకు ఇది అదనపు భారం కానుంది. రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రతి దస్తావేజుపై ఇప్పటికే రూ.500 చొప్పున ఎమినిటీస్‌ ఫండ్‌ పేరుతో వసూలు చేస్తున్నారు. 2025–26లో కాకినాడ జిల్లాలోని తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సుమారు 90 వేల దస్తావేజులు నమోదు కావడంతో సుమారు రూ.4.50 కోట్ల యూజర్‌ చార్జీలు వసూలయ్యాయి. ఈ నిధులతో కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు.

ఆస్తి వివాదాలకు ఆస్కారం

దస్తావేజు రచన అనేది కేవలం కంప్యూటర్‌లో డేటా నమోదు చేయడం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. స్థానిక ఆస్తుల చరిత్ర, పాత లింక్‌ దస్తావేజులు, సరిహద్దులు, హక్కుల వివరాలపై అవగాహన ఉన్న దస్తావేజు లేఖర్లు ఇప్పటివరకు వివాదాలకు తావులేకుండా పత్రాలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ బాధ్యతలను ప్రైవేట్‌ సంస్థల సిబ్బందికి అప్పగిస్తే భవిష్యత్తులో ఆస్తి వివాదాలు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

పారదర్శకత లోపిస్తుంది

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ప్రజలకు భరోసా ఉంది. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అప్పగిస్తే, ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ విధానంలో 15 నిమిషాలోన్లే దస్తావేజు ఇస్తున్నారు. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ప్రైవేటీకరించడం వల్ల పారదర్శకత లోపిస్తుంది. –బీజే ప్రసాద్‌,

రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘ గౌరవాధ్యక్షుడు, కాకినాడ

వ్యతిరేకంగా ఉద్యమాలు

పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘాలు నల్లబ్యాడ్జీలతో నిరసనలు, పెన్‌డౌన్‌ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, వారి వద్ద పనిచేసే సహాయకులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది.

–చోడపునీడి గోవిందరావు,

దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు, కాకినాడ

కొత్త విధానం తీసుకొస్తే, నలుగురికి ఉపయోగపడాలి.. నలుగురి పొట్టకొట్టేలా ఉండకూడదు.. చంద్రబాబు సర్కారు మాత్రం రెండో విధానాన్నే అమలు చేస్తోంది.. ప్రభుత్వం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన 396 జీఓ దస్తావేజు లేఖర్లకు గుదిబండ అయ్యింది.. వారి ఉపాధికి విఘాతంగా మారింది.. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వారంతా ఆందోళన బాట పట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement