● సర్దుబాటు ప్రక్రియ కోసం ఎదురుచూపులు
● ఉమ్మడి జిల్లాలో 608 మిగులు పోస్టులు
రాయవరం: పాఠశాల విద్యాశాఖలో గత ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 100 మంది వరకు ఇప్పటికీ పాత పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. బదిలీ ఆర్డర్లు తీసుకున్న వెంటనే కొత్త స్థానాల్లో రిపోర్టుచేసి తిరిగి పూర్వ పాఠశాలలకు వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. కొత్తగా పోస్టింగ్ వచ్చిన పాఠశాలలకు పంపాలని వారు కోరుతున్నా విద్యాశాఖ నుంచి స్పందించలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఎనిమిదేళ్లపాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసిన టీచర్లు గత ఏడాది జూన్‌లో చేపట్టిన బదిలీల్లో వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లారు. కానీ వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కారణం వారు ప్రస్తుతం పనిచేసే స్థలానికి మరో టీచర్ రాకపోవడమే. వారు వస్తే కానీ వీరు రిలీవ్ కారు. వారిలో అత్యధికులు హిందీ స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో హిందీ టీచర్లకు కొరత ఉంది. గత ఏడాది డీఎస్సీలో ఈ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ప్రత్యామ్నాయంగా టీచర్లు లేకపోవడంతో వారిని రిలీవ్ చేయవద్దని సంబంధిత హెచ్‌ఎంలను విద్యాశాఖ ఆదేశించింది. కానీ వారి జీతాలు మాత్రం బదిలీ అయిన పాఠశాలల నుంచే తీసుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో బదిలీలకు వచ్చే వెయిటేజ్ పాయింట్లలో కోత పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిగులు జాబితాకు ఎదురుచూపు
పాఠశాల విద్యాశాఖ చేపట్టిన మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మండల స్థాయిలో దాదాపుగా పూర్తి కావొచ్చింది. మండల స్థాయిలో సర్దుబాటు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం జిల్లా విద్యాశాఖకు, అక్కడి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. సవరణ షెడ్యూల్ ప్రకారం మండల స్థాయిలో కౌన్సెలింగ్ చేసి, అవసరం ఉన్న స్థానాలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. సీనియారిటీ జాబితాల కోసం ఎంఈవోలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆదివారం డీఈవో లాగిన్‌కు చేరుకున్నట్లుగా సమాచారం వచ్చింది. మొదటి షెడ్యూల్ అడుగు ముందుకు పడకుండానే ముగిసిపోగా, రెండవ షెడ్యూల్‌ను ప్రకటించి, శుక్రవారం జిల్లాలోని హైస్కూల్ ఫ్లస్ టీచర్లకు కౌన్సెలింగ్ చేసి ఆప్షన్ ఇచ్చిన సబ్జెక్టు టీచర్లకు స్థానాలు కేటాయించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగులు పోస్టుల జాబితా ఉమ్మడి జిల్లా డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరచి 608 మంది టీచర్లు ఉన్నట్టుగా తేల్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 201, కోనసీమ జిల్లాలో 136, కాకినాడ జిల్లాలో 255, పోలవరం జిల్లాలో 26 టీచర్ పోస్టులు మిగులు ఉపాధ్యాయులుగా ఉన్నారు.
నేడు మండల స్థాయిలో కౌన్సెలింగ్:
మిగులు టీచర్లుగా ఉన్న వారికి సోమవారం మండల స్థాయిలో ఎంఈవోలు కౌన్సెలింగ్ చేసే అవకాశముంది. మండల స్థాయిలో ఉన్న ఖాళీలకు మించి మిగులు ఉపాధ్యాయులు ఉంటే తర్వాత రోజు డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది.
జిల్లాల వారీగా ఎస్‌జీటీ, ఎస్‌ఏ నాన్ లాంగ్వేజ్ మిగులు పోస్టులు ఇలా:
జిల్లా ఎస్‌జీటీ గణితం పీఎస్ బీఎస్ ఎస్‌ఎస్
తూర్పు 111 15 11 13 10
కోనసీమ 77 12 08 09 07
కాకినాడ 162 18 19 12 09
పోలవరం 10 01 00 02 02
జిల్లాల వారీగా ఎస్‌ఏ లాంగ్వేజ్ మిగులు టీచర్లు..
జిల్లా ఇంగ్లీషు తెలుగు హిందీ
తూర్పు 16 17 08
కోనసీమ 10 12 01
కాకినాడ 10 10 15
పోలవరం 08 03 00


