బోట్‌క్లబ్: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా బి.పద్మజ ఆదివారం కాకినాడ డీపీఆర్వో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
భక్తజన సంద్రంలా రత్నగిరి
అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల వ్రతాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ. 35 లక్షల ఆదాయం సమకూరింది. ఆరు వేల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ లోవ అమ్మవారి దేవస్థానం ఆదివారం భక్తులతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 25 వేల మంది భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసా దాల విక్రయం ద్వారా రూ.2,64,525, పూజా టికెట్లకు రూ.4,15,984, కేశఖండనశాలకు రూ.18,160, వాహన పూజలకు రూ.21,116, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.96,600, విరాళాలుగా రూ.14,660, వేద ఆశీర్వచనాలకు రూ.10,602 వచ్చిందని ఈఓ వివరించారు.
విఘ్ననాయకా భజేహం
అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, విశేష పూజలను ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి చేశారు. స్వామివారికి ఇరువురు జంటలు పంచామృతాభిషేకాలు, 34 మంది లఘున్యాస అభిషేకాలు చేశారు. శ్రీలక్ష్మీగణపతి హోమంలో 19 మంది భక్తులు పాల్గొన్నారు. 19 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ముగ్గురికి అన్నప్రసన, 10 మందికి తులాభారం, 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,250 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ.3,08,106 ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
ఐటీఐలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
ముమ్మిడివరం: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి 12 వరకు కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కన్వీనర్ ఎం.వేణుగోపాల వర్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు జిల్లాల్లో 1,831 మంది నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లకు 13, 14 తేదీల్లో ఇతర అభ్యర్థులతో భర్తీ చేస్తామని తెలిపారు.


