ఫ ఇంజినీరింగ్ ప్రవేశాలకు జాప్యం
ఫ కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై లేని స్పష్టత
ఫ ఈఏపీ సెట్ ఫలితాలు వచ్చినా
సాగని ప్రక్రియ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అన్ని పరీక్షలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇందులో ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రధానమైనవి. ఈఏపీ సెట్ ఫలితాలు పరీక్షల నిర్వహణ అనంతరం దాదాపు నెలన్నర తరువాత ఈ నెల 1న విడుదల చేశారు. రోజులు గడుస్తున్నా కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంపై విద్యార్థులు నిరుత్సాహ పడుతున్నారు. ఇంకా ఫీజులు ఖరారు చేయకపోవడంతో షెడ్యూల్ విడుదల చేయలేదని కళాశాలల యాజమన్యాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, తొలి విడత అడ్మిషన్లు ఈ నెల 10వ తేదీకి పూర్తి చేయనున్నారు. మన రాష్ట్రంలో ఇంకా ఏవిధమైన సమాచారం లేకపోవడంతో ఈఏపీ సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్, డ్రీమ్డ్ యూనివర్సిటీలు దాదాపు ప్రవేశాలు పూర్తి చేసుకున్నాయి. ప్రైవేట్ కళాశాలల యాజమన్యా కోటా సీట్లకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన వారు మాత్రం ఎదురుచూపులు చూస్తున్నారు. యాజమన్యా కోటాకు సైతం ప్రభుత్వం నిర్ణయించే ఫీజులే ప్రామాణికం. ఏపీ ఫీజు పర్యవేక్షణ కమిటీ (ఎపీఎఫ్‌ఆర్‌ఏంసీ)కి ఇంత వరకూ చైర్మన్‌ను నియమించలేదు. సభ్యుల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నియామకం పూర్తయితే కళాశాలల ఆదాయ వ్యయాలు పరిశీలించి ఫీజులను నిర్ణయిస్తారు. కమిటీ నియామకానికి మంత్రి మండలి ఆమోదించి ఇప్పటికే మూడు నెలలు పూర్తయ్యింది. ఉన్నత విద్యా సంస్థ మూడేళ్లకొకసారి ఫీజులు నిర్ణయిస్తారు. గతంలో నిర్ణయించిన ఫీజులు 2025–26 విద్యా సంవత్సరంతో ముగిసింది. 2026–27 నుంచి మరో మూడేళ్లకు ఫీజులు నిర్ణయించేందుకు సమయం లేదనుకుంటే పాత వాటినే ఈ ఏడాది కొనసాగిస్తామనే జీఓ ఉన్నత విద్యాశాఖ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాత ఫీజులనే అమలు చేస్తుందా.. లేకుంటే పెంచుతారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇంజినీరింగ్ కళాశాలలు కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించగా, ఈ ఏడాది కనీస ఫీజు రూ.60 వేలు ఉండాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంజినీరింగ్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాకముందే కళాశాలలు అడ్మిషన్లపై హడావుడి చేస్తున్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి మరీ ప్రచారానికి దిగుతున్నాయి.
ఈఏపీ సెట్ రాసిన వారి వివరాలు
జిల్లా దరఖాస్తులు హాజరు ఉత్తీర్ణత
కాకినాడ 5,706 (ఇంజినీరింగ్ 5,469 4,090
2,975 (ఫార్మశీ) 2,733 2,455
తూర్పు 8,836 (ఇంజినీరింగ్) 8,477 6,747
గోదావరి 2.680 (ఫార్మశీ) 2,493 2,317
కోనసీమ 3.302 (ఇంజినీరింగ్) 3,199 2,323
1,320 (ఫార్మశీ) 1,200 1,096
మూడింతల వసూలు
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమన్యా కోటా సీట్ల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించే ఫీజులే ఆధారం. కన్వీనర్ కోటాపై మూడింతలు వసూలు చేసుకునే అవకాశం యాజమాన్యాలకు ఉంది. దీని ప్రకారమే ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకుంటాయి. గతేడాది కన్వీనర్ కోటా కంటే 20 శాతం పైగా ఎక్కువగా చూపి మూడింతలు వసూలు చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజులు నిర్ణయిస్తేనే యాజమాన్య కోటా కింద ఎంత చెల్లించాలో స్పష్టత వస్తుంది. ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 950 సీట్లతో పాటు, 26 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 15 వేల సీట్లు ఉన్నాయి.


