శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌పై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌పై ఫిర్యాదు

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

భూ వివాదం పరిష్కరిస్తానని

రూ.10 లక్షలు తీసుకున్నారని ఆరోపణ

కాకినాడ రూరల్‌: టీడీపీ నేత, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబుపై కాకినాడ సంతోష్‌నగర్‌కు చెందిన చింతాకుల విజయ్‌ గాంఽధీ శనివారం రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణకు ఫిర్యాదు చేశారు. స్థానిక శశికాంత్‌నగర్‌లో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విజయ్‌గాంధీ ఫిర్యాదు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట రాసిన ఫిర్యాదులో తమ కుటుంబానికి చెందిన భూ వివాదంలో ప్రయోజనం కలిగేలా పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇప్పిస్తానని సత్తిబాబు నమ్మించడంతో గత ఏడాది ఫిబ్రవరిలో రూ.10 లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సొమ్ము బదిలీ వివరాలు, సత్తిబాబు వాట్సప్‌ సందేశాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం అవ్వలేదని, సత్తిబాబును అడిగితే దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. న్యాయం చేస్తారని నమ్మకంతో ఫిర్యాదు చేశామని విజయ్‌ గాంధీ పేర్కొన్నారు. ఫిర్యాదుపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు.

ఎన్యూమరేషన్‌

ఫారాలు ఇవ్వరూ

పెద్దాపురం: మండలంలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. గ్రామంలో సుమారు 2400 పైగా ఓటర్లు ఉండగా అందులో 200 మందికి పైగా ఎన్యూమరేషన్‌ ఫారాలు అందలేదని గ్రామానికి చెందిన మిరియాల సూరిబాబు అవేదన వ్యక్తం చేశారు. సర్‌ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో అధికారులు పారదర్శకంగా పనిచేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

శృంగార వల్లభుని

ఆదాయం రూ.1.9 లక్షలు

సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ, భూ సమేత శృంగారవల్లభ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు కాలి నడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జామున స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,26,880 అన్నదాన విరాళాలు రూ.37,091, కేశ ఖండన ద్వారా రూ.4,480, తులాభారం ద్వారా రూ.400, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.21,675తో కలిపి రూ.1,90,526 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ సర్పంచ్‌ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్‌ మొయిలి సంధ్య తదితరులు సేవలందించారు.

8న రాజగోపురంపై కలశ ప్రతిష్ఠ

తుని రూరల్‌: తలుపులమ్మ తల్లి లోవ దేవస్థానంలో కొత్తగా నిర్మించిన ఐదు అంతస్తుల రాజగోపురంపై ఈ నెల ఎనిమిదో తేదీన కలశ ప్రతిష్ఠ చేయనున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు శనివారం తెలిపారు. రూ.2.6 కోట్లతో నిర్మించిన రాజగోపురంపై 108 దేవీ అవతారాల విగ్రహాలు తీర్చిదిద్దారు. ఆరో తేదీన విఘ్నేశ్వర పూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమై ఏడున మంటపారాధనలు, శిఖర యంత్ర హవనం, హోమం, జపాలు నిర్వహిస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం 9.55 గంటలకు శిఖర కలశ స్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement