‘పట్టు’ రైతులను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

‘పట్టు’ రైతులను ఆదుకోండి

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

పిఠాపురం: పట్టు పరిశ్రమను పట్టించుకోకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు న్యాయం చేయాలని గొల్లప్రోలు మండలం చేబ్రోలు రైతులు శనివారం కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి పాలనలో పట్టు పరిశ్రమ మూతపడే పరిస్థితికి రావడంతో శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతకు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు శనివారం ఆమె రైతులతో కలిసి సమస్య వివరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా పట్టు పరిశ్రమతో మమేకమై సుమారు 300 పట్టు పురుగుల పెంపక షెడ్లలో పట్టు పురుగులు పెంచుతూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. నేడు ఈ పరిశ్రమ అనేక సమస్యలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. రూ.4 కోట్ల పట్టుగూళ్ల ఇన్సెంటివ్‌లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. చేబ్రోలు పట్టుగూళ్ల మార్కెట్‌ శిథిలావస్థకు చేరుకుందని వర్షాలు పడితే గూళ్లు తడిసిపోతున్నాయని, తక్షణం మరమ్మతులు చేయాలని, అసంపూర్తిగా ఉన్న మార్కెట్‌ భవనాన్ని పూర్తిచేయాలని కోరారు. పట్టుగూళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించి పట్టు పరిశ్రకు పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.

యాప్‌తో ఇబ్బందులు పడుతున్నాం

ఎరువుల సరఫరా కోసం అమలు చేస్తున్న యాప్‌ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్‌కు వివరించారు. యాప్‌పై రైతులకు తగిన అవగాహన, ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేకపోవడం, ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్‌ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. సర్వర్‌ సాంకేతిక లోపాలు, ఎరువుల ఎంపిక సమయంలో ధరలు, పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొన్నారు. యాప్‌ విధానాన్ని రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వులవకాయల నాగ లోవరాజు, గొల్లపిల్లి నానాజీ, ఒ.చక్రధరుడు, పలువురు రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వంగా గీత, రైతుల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement