● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 2,500 వ్రతాల నిర్వహణ
అన్నవరం: సత్యదేవుని ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలో వివాహాలు జరుగుతుండడంతో నవ దంపతులు, వేలాదిగా బంధుగణంతో స్వామివారి దర్శనానికి వస్తుండడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఘాట్ రోడ్డు సైతం భక్తులతో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయని, ఆలయానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సుమారు ఆరు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు.


