కూటమి పాలనలో రైతులకు కష్టాలే.. | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో రైతులకు కష్టాలే..

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తొలకరి ప్రారంభమైంది.. సాగుకు సమయం ఆసన్నమైంది.. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలకమైన వ్యవసాయ శాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. ఈ కుర్చీ కోసం పోటీ కారణంగా తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల నియామకంపై చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన విజయ్‌కుమార్‌ గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని నియమించాల్సి ఉండగా, మూడు రోజులైనా ఎవరినీ కేటాయించలేదు. కనీసం వ్యవసాయ శాఖ ఏడీకి కూడా ఇన్‌చార్జి ఉత్తర్వులు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్‌ పనులు ముమ్మురం అయ్యాయి. ఒకపక్క రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌తో రైతులు ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మొబైల్‌ ఫోన్లలో ప్రత్యేక యాప్‌ ద్వారా ఇండెంట్‌ పెట్టుకున్న వారికి మాత్రమే ఎరువులు సరఫరా చేయడంతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. యాప్‌లో ఎరువులు బుకింగ్‌ జరగని రైతులకు నేరుగా అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన బాధ్యత జిల్లా వ్యవసాయ శాఖాధికారికి ఉంది. ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో కీలక సమయంలో ఇబ్బంది ఎదురవుతోంది. జిల్లాలోని పలు మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయశాఖాధికారులు సైతం జిల్లా కార్యాలయానికి ఫోన్లు చేసి ఎవరిని నియమించారని అడుగుతుంటే, సమాధానం చెప్పలేక పోతున్నామని ఓ అధికారి తెలిపారు.

ఆ ఇద్దరి మధ్య పోటీ

జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసేందుకు ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గతంలో జిల్లా వ్యవసాయ శాఖ డీడీగా పనిచేసిన వీటి రామారావు ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆత్మ పీడీగా పనిచేస్తున్న రాబర్ట్‌ పాల్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రామారావుకు మెట్టకు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు ఉన్నట్లు సమాచారం. రాబర్ట్‌పాల్‌ సైతం ఇద్దరు ఎమ్మెల్యే మద్దతుతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు నియమించాలో తెలియక వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.

పిఠాపురం: కూటమి పాలనలో కష్టాలు అనుభవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలంటూ గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పలువురు రైతులు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీతకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఆమెకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆ రైతులు మాట్లాడుతూ పట్టు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.4 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. పంటలు నష్టపోవడం, తెగుళ్ల కారణంగా చాలా మంది రైతులు పట్టు పురుగులు పెంపకం వదిలేసి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్సెంటివ్‌ బకాయిలు విడుదల చేస్తామని, ఈ ప్రాంతాన్ని సిల్క్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలు ముందు హామీ ఇచ్చారన్నారు. రెండేళ్లు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదన్నారు. యాభై ఏళ్లుగా రెండు వేల ఎకరాల్లో మల్బరీ తోటలు పెంపకం, 300 షెడ్లలో పట్టు పురుగులు పెంపకం చేపట్టేవారమన్నారు. ఇప్పుడు 300 ఎకరాల్లో మాత్రమే తోటలు, 50 షెడ్లలో పురుగులు పెంపకం జరుగుతుందన్నారు. యాప్‌ల వల్ల రైతులకు ఎరువులు అందడం లేదని వాపోయారు. సాంకేతిక సమస్యలు, వెబ్‌ ల్యాండ్‌లో లోపాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు లేక ఎరువులు అందడం లేదన్నారు. గడచిన రెండేళ్ల నుంచి బీమా కూడా ఇవ్వలేదన్నారు. ఈ సమస్యలపై వంగా గీత స్పందిస్తూ తక్షణమే విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తాము ముందు ఉంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, ములికే సత్యనారాయణ, ఓరుగంటి చక్రి, రవి, శ్రీను, లోకారెడ్డి అప్పన్నదొర, ఓరుగంటి సీతారామరాజు, నూజివీడు సూర్య, యలమంచిలి గంగారావు, శీరం పోతురాజు, వులవకాయల రాంబాబు, ఓరుగంటి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

ఫ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

నియామకంలో జాప్యం

ఫ ఇద్దరి మధ్య గట్టి పోటీతో గందరగోళం!

ఆదుకోవాలని మాజీ ఎంపీ గీతకు రైతుల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement