బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ విధానాలే విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదానికి కారణమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన పది మంది కుటుంబాలకు రూ. కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడీషియల్ విచారించి నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. విధానాల రూపకల్పనలో ఏమాత్రం సంబంధం లేని ఆరుగురు చిరుద్యోగులను సస్పెన్షన్ చేసి, అసలు దోషులను రక్షిస్తున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి ప్రమాద మృతుల త్యాగాలను అవమానపరిచేలా ఉందన్నారు. పోరాడి, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ, సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించండి
కాకినాడ క్రైం: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాకినాడ శాఖ కమిటీ చైర్మన్ గుద్దటి రామ్మోహనరావు ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలను కలసి పీఆర్‌సీ ఏర్పాటు, నాలుగు డీఏల విడుదల, ఇంటీరియల్ ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, జేఏసీ సెక్రటరీ జనరల్ కేవీవీ నగేష్, ఎన్జీఓ నాయకులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, కె.సతీష్, ఎన్‌వీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. ఉమ్మడి జిల్లాతో పాటు సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రుల రాకతో సత్యదేవుని ఆలయంలో సందడి నెలకొంది. వారంతా స్వామివారి వ్రతాలాచరించారు. సుమారు 30 వేల మంది భక్తులు రాగా, సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. అనంతరం భక్తులు సప్త గోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,100 జరగ్గా, ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.


