రాష్ట్రంలో పసిబిడ్డలకు రక్షణ ఎక్కడ! | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పసిబిడ్డలకు రక్షణ ఎక్కడ!

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

తుని రూరల్‌: రాష్ట్రంలో పసిబిడ్డలు, మహిళలకు రక్షణ కరువైందని, రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి నెలరోజులవుతున్నా ఆచూకీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ అన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం ఆయిల్‌పామ్‌ తోటలో ఉన్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు సుంకర భవానీ, గణేష్‌లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ అంశంలో ముఖ్యమంత్రితో పాటు హోం శాఖను, పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్న మంత్రి నారా లోకేష్‌ సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు, లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు ఎలా ఉన్నాయో రోజూ ప్రజలు చూస్తున్నారని రామచంద్ర యాదవ్‌ చెప్పారు. దళితులు, బీసీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. నిన్నటికి నిన్న ఒంగోలులో ఓ నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన షాపులో ఉండగా, అధికార పార్టీకి చెందిన వ్యక్తి మద్యం తాగి వచ్చి కత్తితో గొంతు కోసి దాడికి పాల్పడడం దారుణమని అన్నారు. ఇటువంటి ఘటనలు అనేక జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని రామచంద్ర యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి బాధ్యత వహించాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆ శాఖ తనది కాదని చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు చిత్తశుద్ధి ఉంటే, టెక్నాలజీల గురించి మాట్లాడే మీరు తప్పిపోయిన పాపపై శ్రద్ధ పెట్టి ప్రత్యేక బృందాల ఏర్పాటుతో ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

ఫ బీసీవై పార్టీ అధ్యక్షుడు

రామచంద్ర యాదవ్‌

ఫ జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement