ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శుక్రవారం గర్భాలయానికి శిలాస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శైవాగమ పండితుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత భారీ శిలను గర్భాలయంలో అమర్చారు. అనంతరం ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, పురోహితులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ దైవ కార్యక్రమంలో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ విరాళం అందించిన దాత పేరును శిలాఫలకంపై చెక్కిస్తామని నిర్వాహకులు తెలిపారు.
వెండి నంది విగ్రహం సమర్పణ
కాకినాడకు చెందిన ఆకొండి శ్రీరామమూర్తి, ధర్మావతి దంపతుల కుమారుడు శ్రీకాంత్, కోడలు లక్ష్మీజ్యోతి, మనవడు సంపత్ 628 గ్రాముల వెండితో తయారు చేసిన సుమారు రూ.2 లక్షల విలువైన నంది విగ్రహాన్ని వీరేశ్వరస్వామి ఆలయానికి అందజేశారు. తొలుత అర్చకుడు సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో నందికి సంప్రోక్షణ చేశారు. అనంతరం దాత కుటుంబానికి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.


