వీబీ జీ రామ్‌జీ పథకంలో ఓ కూలీకి ఈ–కేవైసీ సమయంలో ముఖ గుర్తింపు ప్రక్రియలో వింత ఘటన ఎదురైంది. ఉపాధి కూలీల సంఘ ప్రతినిధి ముత్యాల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మోరిపోడులో రావి వినోద్ అను ఉపాధి కూలీకి జాబ్ కార్డు ఇచ్చే సమయంలో ఈ–కేవైసీ చేశారు. ఆ సమయంలో అతడికి మీసం, తలపై ఎక్కువ జుట్టు ఉండేది. ఇక ఉపాధి పనులు మొదలైనప్పుడు టెక్నికల్‌గా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. తాజాగా అతడు జుట్టు దగ్గరకు కత్తిరించుకోవడంతో పాటు, ముఖంపై మీసం తొలగించాడు. ఈ నేపథ్యంలో అతడి ముఖ గుర్తింపునకు ఈ–కేవైసీలో శతవిధాలా ప్రయత్నం చేసినా, ఎంత సమయం తీసుకున్నా కూడా ఫలితం రాలేదు. సదరు గ్రూపులోని ఒక వ్యక్తి సలహా మేరకు అతడి తలకు, మీసం మాదిరిగా బొగ్గుతో దట్టంగా దిద్దారు. వెంటనే అతడి ముఖ గుర్తింపు లభించింది.
– సఖినేటిపల్లి


