ఫ్యాక్టరీకి రవాణా చేయడానికి సిద్ధం చేసిన గెలలు
● టన్ను ఆయిల్‌పామ్
గెలల ధర రూ.23,777
● ఎకరాకు రూ.2.40 లక్షల ఆదాయం
● సాగుకు రైతుల ఆసక్తి
● ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంత భూములు ఆ పంటకు అనుకూలంగా ఉండడం, లాభాలు ఇవ్వడం దీనికి కారణం. రెండేళ్లుగా జిల్లాలో సుమారు 2 వేల హెక్టార్లలో మొక్క తోటలు వేసి సాగు చేస్తుండగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో అదనంగా 4,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
28,611 హెక్టార్లలో సాగు
జిల్లాలోని 21 మండలాల్లో 28,611 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ను సాగు చేస్తున్నారు. మొక్క నాటిన 4వ ఏట నుంచి ప్రారంభమైన దిగుబడి 25 ఏళ్ల వరకు ఉంటుంది. మొక్క తోటల నుంచి ఎకరాకు 4 నుంచి 5 టన్నుల గెలలు దిగుబడి రాగా, 7వ ఏడాది నుంచి 10 టన్నులకు పైగా వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 13 టన్నులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు సంబంధించి రబీలో దిగుబడి తక్కువగా ఉన్నప్పటికి గెలలకు మద్దతు ధర లభిస్తుంది. ఖరీఫ్‌లో జూన్ నుంచి గెలల దిగుబడి ప్రారంభమై, ఎకరాకు సగటున 10 టన్నులు వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు నికర లాభం ఉంటుందని అంచనా.
ఉచితంగా మొక్కలు
ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.29 వేల విలువైన 240 మొక్కలను ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు వేయాల్సి ఉండగా, మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి దిగుబడి మొదలై, మొదటి ఏడాది ఎకరాకు టన్ను ఉంటుంది. అలాగే హెక్టారుకు ఏడాదికి రూ.10,500 చొప్పున వరసగా నాలుగేళ్లు రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. కాగా.. వరి నుంచి ఆయిల్‌పామ్‌కు వెళ్లిన రైతులకు అదనంగా హెక్టారుకు రూ.21 వేలు ఇస్తున్నారు.
ఆయిల్ రికవరీని బట్టి ధర నిర్ణయం
ఆయిల్‌పామ్ గెలల ధరను ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ రికవరీని బట్టి నిర్ణయిస్తోంది. జూన్‌లో ఫ్యాక్టరీకి రైతులు సరఫరా చేసిన గెలలకు జూలై 15 దాటిన తర్వాత ధర నిర్ణయించి, రైతుల బ్యాంకు ఖతాకు జమ చేస్తుంది. జూన్‌లో టన్ను గెలల ధర రూ.23,770 ఉంది. ప్రతి నెలా ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుతూ వస్తోంది.
జిల్లాలో ఆయిల్‌పామ్ తోటలు
(హెక్టార్లలో)
మండలం సాగు విస్తీర్ణం
అనపర్తి 287.67
బిక్కవోలు 1,043.39
రంగంపేట 4,351.41
రాజానగరం 2,903.49
కోరుకొండ 1,287.64
గోకవరం 939.57
సీతానగరం 560.58
రాజమహేంద్రవరం రూరల్ 97.62
కొవ్వూరు 32.51
చాగల్లు 690.07
తాళ్లపూడి 383.26
పెరవలి 86.51
ఉండ్రాజవరం 66.59
దేవరపల్లి 4,570.63
గోపాలపురం 2,232.28
నిడదవోలు 394.99
నల్లజర్ల 8,284.17
మండపేట 368.49
కపిలేశ్వరపురం 24.93
గెలల ధర పెరుగుదల
(2026 నుంచి టన్నుకు)
జనవరి రూ.19,218
ఫిబ్రవరి రూ.20,680
మార్చి రూ.21,546
ఏప్రిల్ రూ.22,936
మే రూ.23,656
జూన్ రూ.23,770
లాభదాయకం
ఆయిల్‌పామ్ తోటల సాగు లాభదాయకంగా ఉంది. 2026–27 ఖరీఫ్‌లో జిల్లాలో వరికి బదులుగా 4,800 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే నల్లజర్ల మండలంలో 800 హెక్టార్లలో కొత్తగా మొక్కలు వేశారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందజేస్తోంది.
– ఎన్.మల్లికార్జునరావు,
జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం


