ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
జగ్గంపేట: బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను మండలంలోని రామవరం వద్ద శుక్రవారం జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఇద్దరు మహిళలు తరచూ బస్టాండ్‌లో తిరగడం గమనించారు. వారే చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో రామవరం వద్ద అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన 35 ఏళ్ల తోట హుస్సేన్‌బీ, అనకాపల్లికి చెందిన 25 ఏళ్ల గంట మరియమ్మను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సాధారణ ప్రయాణికులతో కలిసి పోయి, వారు బస్సులు ఎక్కే సమయంలో బ్యాగులు, నగదు, బంగారు వస్తువులను దొంగతనం చేస్తున్నట్టు నిర్దారించారు. వీరిని పెద్దాపురం కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులను అరెస్టు చేయడానికి కృషి చేసిన సీఐ బి.తిరుపతిరావు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావను ఉన్నతాధికారులు అభినందించారు.
విందు ఏర్పాట్లలో విషాదం
● విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ డ్రైవర్ మృతి
● చిత్రాడలో ఘటన
పిఠాపురం రూరల్: తన అన్న ఉద్యోగ విరమణ చేయడంతో తమ్ముడు ఎంతో సంతోషించాడు. ఈ సందర్భంగా తన ఇంటి వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అనంతరం బంధువులకు విందు ఇస్తున్న వేళ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్రాడకు చెందిన పెండెం వెంకట సుబ్రహ్మణ్యం (57) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన అన్న కోటేశ్వరరావు సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగిగా గత నెల ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో తన ఇంటికి అన్న రావడంతో గురువారం రిటైర్‌మెంట్ ఫంక్షన్‌ను సుబ్రహ్మణ్యం ఘనంగా నిర్వహించాడు. అనంతరం శుక్రవారం బంధువులకు విందు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుండగా, అక్కడే విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యానికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
తుని: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని జీఆర్పీ ఎస్.సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 2వ తేదీ ఉదయం బెంగళూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో అన్నవరంలో జనరల్ బోగిలో ఎక్కిన నలుగురు యువకులు ప్రయాణికులను బ్లేడ్లతో బెదిరించారు. దీంతో ప్రయాణికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా రైలు నుంచి దిగి పారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విశాఖపట్నం జీఆర్పీ పోలీస్‌స్టేషకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరు తుని జీఆర్పీ ఎస్సై సత్తిబాబు అప్రమత్తమయ్యారు. సెల్ టవర్ ఆధారంగా నిందితుల సెల్‌ఫోన్లను ట్రేస్ చేసి పౌల్ (24), వనర్జీ పౌల్ (22), సబ్బవరపు సాంబశివరావు(25), షేక్ రఫీ (18)ని అరెస్ట్ చేశారు.


