● ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి
● లోతుగా తవ్వకాలు, మట్టి తరలింపు
● అనుమానంతో అధికారుల పరిశీలన
కొత్తపల్లి: ఇంటి నిర్మాణం పేరుతో పంచాయతీ అనుమతి తీసుకుని, భారీ లోతుగా తవ్వకాలు జరుపుతున్న ఘటన పాత ఇసుకపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమీపంలో జరిగింది. గుప్త నిధుల కోసమే ఇంత లోతు తవ్వుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ చిన్నారావు, ఎస్సై వెంకటేష్ ఘటనా ప్రాంతానికి వెళ్లి, సంబంధిత వ్యక్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టడంపై ఆరా తీశారు. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడింపల్లి నరసింహరాజు అనే వ్యక్తి 200 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా పరిమితికి మించి సుమారు 20 అడుగులకు లోతుకు పైగా తవ్వకాలు చేపట్టాడు. ఆ గొయ్యిలో రెండు ప్రదేశాల్లో మట్టి జారి పోకుండా కర్రలు కట్టి చెక్కలు దాపు పెట్టి, మరికొంత లోతుగా తవ్వించాడు. విషయం తెలుసుకున్న స్థానిక రెవెన్యూ అధికారి కిషోర్, పంచాయతీ కార్యదర్శి యాళ్ల జీయన్న సంబంధిత నరసింహరాజుకు నోటీసులను అందజేశారు. అయినా తవ్వకాలు ఆపకపోవడంతో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైలకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, ఎస్సై సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని పంచాయతీకి ఆదేశించామన్నారు. తవ్విన మట్టిని యథాతథంగా వేయాలని చెప్పామన్నారు. ఈ తవ్వకాల విషయాన్ని కలెక్టర్, ఆర్డీఓ, పాడా పీడీలకు సమాచారం అందించామన్నారు.
పలు అనుమానాలు
తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని గుడి దిబ్బగా పిలుస్తారు. గతంలో ఇదే ప్రదేశంలో ఆలయం ఉండేదని పలువురు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించి గుప్త నిధులు ఉండొచ్చనే కారణంతో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంటి నిర్మాణం కోసం సుమారు 6 నుంచి 7 అడుగులే తవ్వుతారు. కానీ ఇక్కడ సుమారు 20 అడుగులకు పైగా తవ్వకాలు చేపట్టడంపై అనుమానాలు వస్తున్నాయి.


