‘ఇక మాకెవరు దిక్కు’ | - | Sakshi
Sakshi News home page

‘ఇక మాకెవరు దిక్కు’

Jul 4 2026 12:14 AM | Updated on Jul 4 2026 12:14 AM

రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

రోదించిన భార్య, కుటుంబ సభ్యులు

రాజానగరం: నిత్యం సైకిల్‌పై కలవచర్ల నుంచి రాజమహేంద్రవరం కూలి పనికి వెళ్లి రావడం అతడికి అలవాటే. రోజు మాదిరిగానే ఉదయాన్నే భోజనం తీసుకు వెళ్లిన భర్త రాత్రికి తిరిగి వస్తాడని ఆ ఇల్లాలు ఎదురు చూసింది. కానీ లారీ రూపంలో మృత్యువు అతడిని మింగేసిందని తెలిసి కుప్పకూలిపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి సంద్రమైంది. ‘మమ్మల్ని అనాథలను చేసి పోయావయ్యా... ఇక మాకెవరు దిక్కు’ అంటూ రోదించింది. జాతీయ రహదారిపై రాజానగరం వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు. కలవచర్లకు గొనూరి నూకరాజు (39) కూలి పని కోసం సైకిల్‌పై రాజమహేంద్రవరానికి వెళ్లి, వస్తుంటాడు. ఈ క్రమంలో పాత సైకిల్‌తో ఇబ్బంది పడుతున్నాడని గ్రహించిన యజమాని రెండు రోజుల క్రితమే కొత్త సైకిల్‌ కొనిచ్చాడు. దానిపై గురువారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తున్న అతడిని జాతీయ రహదారిపై కలవచర్ల రోడ్డు మలుపు తిరుగుతున్న సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీ ఢీకొంది. లారీ అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య గొనూరి బేబీ, కుటుంబ సభ్యులు ప్రమాద దృశ్యాన్ని చూసి చలించిపోయారు. గుండెలవిసేలా రోదించారు. మృతుడికి 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. రాజానగరం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement