దేవరపల్లి: జ్యూయలరీ దుకాణంలోని 12 కిలోల వెండి వస్తువులను దొంగలు చోరీ చేశారు. నల్లజర్ల మండలం పోతవరంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనా వివరాలు ఇవీ.. పోతవరంలో శ్రీనిధి జ్యూయలరీ పేరుతో కల్వకుంట్ల శ్రీనివాసరావు దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి తెరవగా లోపల గాజులు, అద్దాలు పగిలి వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెనుక వైపు ఉన్న తాళం బద్దలు కొట్టి ఉండడంతో పాటు దుకాణంలోని సుమారు 12 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో శ్రీనివాసరావు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి సీఐలు రవికుమార్, బీఎన్ నాయక్, నల్లజర్ల ఎస్సై ఆంజనేయబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు.


